టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. తమ ఖాతాలో మూడో పొట్టి వరల్డ్‌కప్ ట్రోఫీని జమచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ ఘనత సాధించింది.
చరిత్ర పుటల్లోకి
ఈ అద్వితీయ గెలుపుతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో పాటు సూర్య పేరు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సూర్య రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడమేనని పేర్కొన్నాడు. తద్వారా ఇప్పుడే తాను రిటైర్ కాబోనని 35 ఏళ్ల సూర్య సంకేతాలు ఇచ్చాడు.
గోల్డ్ మెడల్ లక్ష్యం
కాగా 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ తదుపరి ఎడిషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘తదుపరి ఒకే ఏడాదిలో టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో.. ‘‘ఈ సంతోషం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.
వాళ్లు అద్భుతం
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. ఫైనల్లో ఆ పని చేసి చూపించారు. ఇక మా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు.
తరానికొక్క అరుదైన బౌలర్. అతడిని జాతీయ సొత్తు అని పిలవవచ్చు. జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. జట్టులోని ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను చక్కగా నెరవేర్చారు’’ అని సూర్య ప్రశంసలు కురిపించాడు.
చదవండి: లక్కీ కెప్టెన్!
From World Cup glory to the next challenge, #SuryakumarYadav opens up about what lies ahead for #TeamIndia.🇮🇳❤️#T20WorldCup #INDVNZ pic.twitter.com/5NPw2aNK5X
— Star Sports (@StarSportsIndia) March 8, 2026


