అబ్బా.. అదొక కిల్లర్‌ కాంబో: ధోని పోస్ట్‌ వైరల్‌ | Coach Sahab: MS Dhoni Priceless Post On T20 WC Win Message For Gambhir | Sakshi
Sakshi News home page

అబ్బా.. అదొక కిల్లర్‌ కాంబో: ధోని పోస్ట్‌ వైరల్‌

Mar 9 2026 10:57 AM | Updated on Mar 9 2026 11:32 AM

Coach Sahab: MS Dhoni Priceless Post On T20 WC Win Message For Gambhir

టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. బార్బడోస్‌ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌.. తాజాగా ఆదివారం నాటి ఫైనల్లోనూ జయభేరి మోగించింది. టైటిల్‌ పోరులో న్యూజిలాండ్‌ను ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది.

ఈ నేపథ్యంలో యావత్‌ భారతావని సూర్య సేన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్‌, టీమిండియాకు తొలి టీ20 వరల్డ్‌కప్‌ అందించిన సారథి మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు.. ఒకప్పటి సహచర ఆటగాడు, ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గురించి ఆసక్తికర పోస్టు చేశాడు.

కన్నులపండుగ
‘‘అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు అభినందనలు. ఈరోజు టీమిండియా ఆట కన్నులపండుగగా సాగింది.

అబ్బా అదొక కిల్లర్‌ కాంబో
కోచ్‌ సాహెబ్‌.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్‌ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి బాయ్స్‌. 

ఇక బుమ్రా గురించి కూడా ఒక మాట చెప్పాలిగా.. అతడొక చాంపియన్‌ బౌలర్‌’’ అని ధోని ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫొటో జతచేశాడు. ధోని షేర్‌ చేసిన ఈ పోస్టు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆరు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. 

ఏకైక కెప్టెన్‌గా
కాగా ఐసీసీ 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్‌ను ధోని సారథ్యంలో భారత్‌ గెలుచుకుంది. ఈ జట్టులో గంభీర్‌ సభ్యుడు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్‌కప్‌ (ఇందులోనూ గంభీర్‌ సభ్యుడే), 2013లో చాంపియన్స్‌ ట్రోఫీని ధోని అందించాడు. తద్వారా భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌ భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌
👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌
👉టాస్‌: న్యూజిలాండ్‌.. తొలుత బౌలింగ్‌
👉భారత్‌ స్కోరు: 255/5(20)
👉న్యూజిలాండ్‌ స్కోరు: 159(19)
👉ఫలితం: 96 పరుగుల తేడాతో భారత్‌ జయభేరి

చదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement