'త్రి'వర్ణ విజయం | India wins T20 World Cup trophy for the third time | Sakshi
Sakshi News home page

'త్రి'వర్ణ విజయం

Mar 9 2026 4:42 AM | Updated on Mar 9 2026 9:58 AM

India wins T20 World Cup trophy for the third time

మూడోసారి టి20 ప్రపంచకప్‌ ట్రోఫీ సొంతం 

టైటిల్‌ నిలబెట్టుకున్న తొలి జట్టుగా ఘనత

ఫైనల్లో ఏకపక్ష విజయం 

96 పరుగులతో న్యూజిలాండ్‌ చిత్తు 

చెలరేగిన సామ్సన్, ఇషాన్, అభిషేక్‌ శర్మ 

బుమ్రాకు 4, అక్షర్‌కు 3 వికెట్లు  

భారత్‌కు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ సొంతం

సామ్సన్‌ కొట్టిన సిక్స్‌లను కరిగే క్షణాలు కూడా కాసేపాగి వీక్షించినట్లు..  
అభిషేక్‌ బాదిన బౌండరీల్ని పదిలంగా దాచుకోవాలని మైదానం తలచినట్లు..  
ఇషాన్‌ ధనాధన్‌ అర్ధశతకానికి బంతి పెద్ద ఫ్యాన్‌ అయినట్లు...  
అహ్మదాబాద్‌లో పరుచుకున్న ‘పరుగుల’ వెన్నెల యావత్‌ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌ విజయం...దీని తాలూకు వచ్చే ఆనందం... ఓ పూటకే సరిపోదు.ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్నే తమ క్రికెట్‌ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది.ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

2019 వన్డే ప్రపంచకప్‌లో మనల్ని ఫైనల్‌ చేరకుండా సెమీస్‌లోనే వెళ్లగొట్టిన న్యూజిలాండ్‌ జట్టుకు... 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మనగడ్డపై మనల్ని ముంచిన అహ్మదాబాద్‌ వేదికకు.. టీమిండియా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చింది.  

2026 టి20 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగానిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గాకరీబియన్‌లో పట్టుకొచ్చిన టి20 ప్రపంచకప్‌ను సొంతగడ్డపైనా నిలబెట్టుకుంది. సెమీస్‌లోఇంగ్లండ్‌పై, ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటింగ్‌ దళం గర్జించింది.

వందేమాతరం... వందేమాతరం... లక్ష మంది అభిమానులతో అహ్మదాబాద్‌ స్టేడియం హోరెత్తిపోయింది... ఇందులో రెండున్నరేళ్ల క్రితం ఇదే మైదానంలో గుండెకోతను అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు అది గతం.. నాటి గాయానికి మందు రాసేలా సొంతగడ్డపై, ఫ్యాన్స్‌ సమక్షంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకుంది. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న తొలి జట్టుగా ఘనత సాధించింది. రెండేళ్ల క్రితం విశ్వ విజేతగా నిలిచిన నాటి నుంచి ఏ రోజూ స్థాయి తగ్గకుండా అదే దూకుడు, జోరుతో ఆడిన టీమిండియా అదే తీవ్రతను కొనసాగిస్తూ టైటిల్‌ నిలబెట్టుకోవడం విశేషం.

ఫైనల్లో న్యూజిలాండ్‌తో సమరం అంటే ముందుగా మనదే కొంత పైచేయిగా కనిపించింది... దానికి తగినట్లుగా ఆరంభం నుంచే టాప్‌–3 బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సామ్సన్‌ తన ధాటిని కొనసాగించగా అభిషేక్‌ అసలు పోరులో తన సత్తాను ప్రదర్శించాడు. తోడుగా ఇషాన్‌ కిషన్‌ కూడా చెలరేగడంతో బౌండరీల విధ్వంసం సాగింది. ప్రతీ బంతీ బౌండరీ దాటుతుండగా భారత్‌ ఆట చూస్తే 300 స్కోరు ఖాయమనిపించింది. అక్కడి వరకు చేరకపోయినా 255 పరుగులతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో టీమిండియా నిలిచింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు వేదికపై ఛేదన ఎంత కష్టమో కివీస్‌కు తెలిసే సరికి మ్యాచ్‌ ముగిసిపోయింది... బుమ్రా, అక్షర్‌ బౌలింగ్‌తో ఆ జట్టు కునారిల్లింది. సంపూర్ణ ఆధిపత్యంతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.

అభిషేక్‌ బౌలింగ్‌లో డఫీ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద హైదరాబాదీ తిలక్‌ వర్మ అందుకోవడంతో అన్ని వైపుల నుంచి వేడుకలు మొదలయ్యాయి. గత టోర్నీ గెలుపు అనుభవాన్ని కొందరు మళ్లీ రుచి చూస్తే... తొలిసారి వరల్డ్‌ కప్‌ నెగ్గిన కుర్రాళ్ల ఆనందానికి అవధుల్లేవు... వరల్డ్‌ కప్‌ గెలిపించిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌ చరిత్రకెక్కగా... గత వరల్డ్‌ కప్‌ విజేతలు కపిల్, ధోని, రోహిత్‌ శర్మ గ్యాలరీ నుంచి అభినందిస్తుండగా టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో మువ్వన్నెల జెండాతో సంబరాలు చేసుకున్నారు.  

అహ్మదాబాద్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత జట్టు టి20 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2024లో టైటిల్‌ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో భారత్‌ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 

సంజు సామ్సన్‌ (46 బంతుల్లో 89; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (21 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం న్యూజిలాండ్‌ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టిమ్‌ సీఫెర్ట్‌ (26 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), సాంట్నర్‌ (35 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత్‌ బుమ్రా (4/15), అక్షర్‌ పటేల్‌ (3/27) న్యూజిలాండ్‌ను దెబ్బ తీశారు.  విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 27 కోట్ల 48 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. 

ధనాధన్‌ దూకుడు... 
తొలి ఓవర్లో 7 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు... ఇంత వరకు భారత్‌ కాస్త జాగ్రత్త పడింది. డఫీ వేసిన మూడో ఓవర్‌తో మొదలైన బ్యాటింగ్‌ విధ్వంసం చివరి ఓవర్‌ వరకు సాగింది. టాప్‌–3 బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి కివీస్‌ పనిపట్టారు. ఫెర్గూసన్‌ ఓవర్లో అభిషేక్, సామ్సన్‌ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో 24 పరుగులు వచ్చాయి. హెన్రీ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్‌ బాదగా, డఫీ ఓవర్లో అభిషేక్‌ 3 ఫోర్లు, సిక్స్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 92 పరుగులకు చేరింది. 

18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అభిషేక్‌ వెనుదిరిగినా, కిషన్‌ వచ్చి అదే జోరును కొనసాగించాడు. 33 బంతుల్లో సామ్సన్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఫెర్గూసన్‌ ఓవర్లో సామ్సన్‌ వరుసగా 2 సిక్స్‌లు బాదగా, కిషన్‌ మరో సిక్స్‌ కొట్టాడు. రచిన్‌ వేసిన 14వ ఓవర్లోనైతే సామ్సన్‌ వరుసగా 6, 6, 6తో చెలరేగిపోగా, కిషన్‌ కూడా 23 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. 

అయితే ఎట్టకేలకు తర్వాతి 16–19 వరకు నాలుగు ఓవర్ల పాటు భారత్‌ను కట్టడి చేయడంలో కివీస్‌ సఫలమైంది. నీషమ్‌ వేసిన ఒకే ఓవర్లో సామ్సన్, కిషన్, సూర్యకుమార్‌ (0) అవుట్‌ కాగా... పాండ్యా (18)ను హెన్రీ అవుట్‌ చేశాడు. ఈ నాలుగు ఓవర్లలో కలిపి 28 పరుగులే వచ్చాయి. అయితే నీషమ్‌ వేసిన చివరి ఓవర్లో దూబే (8 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. దాంతో స్కోరు 250 దాటింది.  

సీఫెర్ట్‌ మినహా... 
తమ జట్టుకు శుభారంభం అందించడంలో కివీస్‌ ఓపెనర్లు విఫలమయ్యారు. పాండ్యా ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాది సీఫెర్ట్‌ జోరు ప్రదర్శించినా... మరోవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 4 బంతుల వ్యవధిలో అలెన్‌ (9), రచిన్‌(1) అవుట్‌ కాగా, ఫిలిప్స్‌ను (5) అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేయగలిగింది. వరుణ్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో 23 బంతుల్లో సీఫెర్ట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 

అయితే నాలుగు బంతుల వ్యవధిలో చాప్‌మన్‌ (3), సీఫెర్ట్‌లు వెనుదిరగడంతో సగం టీమ్‌ పెవిలియన్‌ చేరింది. మిచెల్‌ (17), సాంట్నర్‌ కొద్దిసేపు పోరాడగలిగారు.అయితే బుమ్రా అద్భుత బంతితో సాంట్నర్‌ను అవుట్‌ చేయడంతో కివీస్‌ ఓటమి లాంఛనమే అయింది.

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) (సబ్‌) మెక్‌కోన్‌కీ (బి) నీషమ్‌ 89; అభిషేక్‌ (సి) సీఫెర్ట్‌ (బి) రచిన్‌ 52; ఇషాన్‌ కిషన్‌ (సి) చాప్‌మన్‌ (బి) నీషమ్‌ 54; పాండ్యా (సి) సాంట్నర్‌ (బి) హెన్రీ 18; సూర్యకుమార్‌ (సి) రచిన్‌ (బి) నీషమ్‌ 0; తిలక్‌ (నాటౌట్‌) 8; దూబే (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–98, 2–203, 3–204, 4–204, 5–226. బౌలింగ్‌: హెన్రీ 4–0–49–1, ఫిలిప్స్‌ 1–0–5–0, డఫీ 3–0–42–0, ఫెర్గూసన్‌ 2–0–48–0, సాంట్నర్‌ 4–0–33–0, రచిన్‌ రవీంద్ర 2–0–32–1, నీషమ్‌ 4–0–46–3.  

 

 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) వరుణ్‌ 52; అలెన్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 9; రచిన్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) బుమ్రా 1; ఫిలిప్స్‌ (బి) అక్షర్‌ 5; చాప్‌మన్‌ (బి) పాండ్యా 3; మిచెల్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 17; సాంట్నర్‌ (బి)బుమ్రా 43; నీషమ్‌ (బి) బుమ్రా 8; హెన్రీ (బి) బుమ్రా 0; ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 6; డఫీ (సి) తిలక్‌ (బి) అభిషేక్‌ 3; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 159. వికెట్ల పతనం: 1–31, 2–32, 3–47, 4–70, 5–72, 6–124, 7–141, 8–141, 9–152, 10–159. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–32–0, పాండ్యా 4–0–36–1, అక్షర్‌ 3–0–27–3, బుమ్రా 4–0–15–4, వరుణ్‌ 3–0–39–1, అభిషేక్‌ 1–0–5–1.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement