అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్‌ | New Zealand lost WC final in Powerplays: Santner After Loss To India | Sakshi
Sakshi News home page

అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్‌

Mar 9 2026 9:15 AM | Updated on Mar 9 2026 10:06 AM

New Zealand lost WC final in Powerplays: Santner After Loss To India

మరోసారి దురదృష్టం.. స్వయంకృతాపరాధానికి మూల్యం.. 2015. 2019, 2021, 2026.. నాలుగు సందర్భాల్లోనూ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరుకున్న న్యూజిలాండ్‌ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. కీలక సమయంలో ఒత్తిడికి గురై.. మరోసారి ‘చోకర్స్‌’గా మిగిలిపోయింది.

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన కివీస్‌.. ‘రెండోస్థానం’ అనే చేదు ముద్రను పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ విచారం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు ఆట పట్ల మాత్రం తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.

గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము
‘‘అవును.. ఇది జరిగిపోయింది. అయినా మా జట్టు ప్రయాణం ఇక్కడిదాకా సాగినందుకు గర్వంగా ఉంది. మా వాళ్లు గొప్పగా ఆడారు. టోర్నీ ఆసాంతం మేము సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రతీ దశలోనూ ఆటంకాన్ని అధిగమించి ఇక్కడిదాకా వచ్చాము.

ఈరోజు కూడా గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము. స్టేడియం మొత్తం నీలి వర్ణమే. వారి సాక్షిగానే ఓటమిని ఆహ్వానించాము. మేము ఇక్కడ ఫేవరెట్‌ జట్టు కాదు.

ఏదేమైనా సొంతగడ్డపై సూర్యకుమార్‌ సేన అద్భుతం చేసింది. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మా జట్టులోని ఒక్కో సభ్యుడు ఒక్కో సందర్భంలో ముందుకు వచ్చి జట్టును గెలిపించాడు. సూపర్‌-8, సెమీ ఫైనల్లో మేము గొప్పగా ఆడాము.

ముందుగా చెప్పినట్లు గొప్ప జట్టు చేతిలోనే ఫైనల్‌ ఓడిపోయాము. మా వాళ్లు నాకు గర్వకారణం’’ అని సాంట్నర్‌ కివీస్‌ జట్టును ప్రశంసించాడు. ఇక తమ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ..

అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి
‘‘పవర్‌ ప్లేలో వాళ్లు ఒక్క వికెట్‌ కోల్పోకుండా ఏకంగా 90 పరుగుల మేర అసాధారణ స్కోరు నమోదు చేశారు. మేము మాత్రం పవర్‌ప్లేలో సుమారుగా 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అక్కడే చాలా వెనుకబడి పోయాము. 256 పరుగుల మేర భారీ స్కోరు ఛేదనలో ఇలాంటి పరిస్థితి రావడం అతి పెద్ద సవాలు’’ అని సాంట్నర్‌ పేర్కొన్నాడు.

భారత ఓపెనర్ల విధ్వంసం
కాగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో టీమిండియా పవర్‌ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు సాధిస్తే.. న్యూజిలాండ్‌ 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ విధ్వంసం కారణంగా భారత్‌కు పవర్‌ ప్లేలో ఈ మేర స్కోరు సాధ్యమైంది. 

పవర్‌ ప్లే ముగిసేసరికి సంజూ 17 బంతుల్లో 33, అభిషేక్‌ 19 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఓవరాల్‌గా సంజూ 89 పరుగులు సాధించగా.. అభిషేక్‌ 52 పరుగులు చేశాడు. 

చదవండి: Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
లక్కీ కెప్టెన్‌!

Advertisement
 
Advertisement
Advertisement