న్యూజిలాండ్‌కు కలసిరాని వరల్డ్‌కప్ ఫైనల్స్
2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2021 టి20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2026 టి20 వరల్డ్ కప్ ఫైనల్... గత ఆరేళ్లలో నాలుగు ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు నాలుగు సార్లూ రన్నరప్‌కే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడటం, అసలు సమయంలో చేతులెత్తేయడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. వారిని చూస్తే ఇకపై కూడా ఇంతే అనిపించడం మాత్రమే కాదు... ఆ జట్టుపై జాలి పడటం కూడా అనవసరం అనిపిస్తుంది.
2019 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో దురదృష్టం వెంటాడి ఓడినప్పుడు అంతా అయ్యో కివీస్ అనుకున్నారు. కానీ మిగతా మూడు ఫైనల్ మ్యాచ్‌లలో మాత్రం వారిదే స్వయంకృతం. కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక జట్టు పూర్తిగా చేతులెత్తేస్తూ వచ్చింది. సుమారు 50 లక్షల జనాభాతో చిన్న దేశంగా, తక్కువ సౌకర్యాలతో ఉన్న తాము భారత్‌లాంటి జట్టుతో ఫైనల్లో ఆడటమే మహద్భాగ్యం అన్నట్లుగా జట్టు ఆల్‌రౌండర్ ఫిలిప్స్ చేసిన వ్యాఖ్యలు ఆటకు ముందే ఓటమికి సిద్ధమైనట్లుగా అనిపించాయి.
మంచివాళ్లుగా మాకు పేరున్నా సరే... భారత అభిమానులు గుండె పగిలేలా చేయడానికి వెనుకాడం అంటూ ఫైనల్‌కు ముందు ప్రకటించిన కెప్టెన్ సాంట్నర్‌తో పాటు పూర్తిగా టీమ్ తలవంచింది. ఇక్కడ ఓటమి మాత్రం పూర్తిగా స్వయంకృతంలా కనిపించింది. నిజానికి టోర్నీలో సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మినహా కివీస్ అద్భుతంగా ఏమీ ఆడలేదు. లీగ్ దశలో కివీస్ చేతిలో చిత్తు కావడం, సూపర్ ఎయిట్స్‌తో ఇంగ్లండ్ చేతిలో ఓడటం ఆ జట్టును బలహీనతలను బాగా చూపించాయి.
కోల్‌కతాలో జరిగిన సెమీస్‌లో మాత్రం చిన్న గ్రౌండ్, మంచు మధ్య సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. అది వారిలో అతి విశ్వాసానికి దారి తీసినట్లుంది. భారత్‌తో వారి సొంతగడ్డపై ఫైనల్ మ్యాచ్ అంటే గెలుపు ఎంత కష్టమో ప్రతీ జట్టుకు తెలుసు. కానీ ఈ మ్యాచ్‌కు సంబంధించి కివీస్ ఎలాంటి హోం వర్క్ చేసినట్లుగా లేదు. భారత్‌తో సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేసిన తప్పులు తాము చేయకుండా ఎలాంటి వ్యూహంతో ఆడాలో కివీస్ గుర్తించినట్లు లేదు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకొని భంగపడింది. వారి ఆట చూస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్ గెలిచేదేమో అనిపించింది.
మంచు ప్రభావం ఎలా ఉన్నా, మైదానంలో ఛేదన సులువు అని రికార్డులు చెబుతున్నా...ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో ఉండే తీవ్ర ఒత్తిడి వేరు. బలమైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొని తాము లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో లక్ష్యాన్ని ఛేదించగలమని కివీస్ అసలు ఎలా భావించింది! టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఆ జట్టు చేసిన మొదటి తప్పు. టోర్నీ ఆసాంతం టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ల బౌలింగ్‌లో బాగా తడబడింది. సెమీస్‌లో సత్తా చాటిన రెగ్యులర్ ఆఫ్‌స్పిన్నర్ మెక్‌కోన్‌కీని తుది జట్టునుంచి తప్పించడం పెద్ద తప్పు కాగా, అదనపు పేసర్ డఫీనుంచి జట్టు మంచి ప్రదర్శన ఆశించడం కూడా అంతే తప్పు.
సీనియర్ కావడం తప్ప నీషమ్ బౌలింగ్ ఏమాత్రం ప్రభావవంతం కాకపోయినా అతడిని తప్పించే ఆలోచన చేయలేదు. పైగా ఫెర్గూసన్‌లాంటి రెగ్యులర్ పేసర్‌కు ఓవర్లు మిగిలి ఉండగా నీషమ్‌తో ఆఖరి ఓవర్ వేయించింది. తొలి ఓవర్లో హెన్రీ కాస్త స్వింగ్ రాబట్టగా అతడిని ఒక ఓవర్‌కే పరిమితం చేసి డఫీకి బంతినివ్వడంతో అంతా కథ మారిపోయింది. ఏదో భారత్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బంతులు విసిరినట్లుగానే వారి ఆట సాగింది. టీమిండియా స్కోరు చూడగానే సహజంగానే కివీస్ బెంబేలెత్తిపోయింది.
అలెన్ తొందరగా అవుట్ కావడంతో ఇక చేసేదేమీ లేదనే పరిస్థితి కనిపించింది. ఇంగ్లండ్ తరహాలో పోరాడటంలో టీమ్ విఫలమైంది. న్యూజిలాండ్ ఇదే తరహాలో మున్ముందూ ఆడితే ఎప్పటికీ రన్నరప్ స్థానమే తప్ప వరల్డ్ కప్ ఆ జట్టు ఖాతాలో చేరడం సందేహమే. చివరగా... 2024 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికాకు ఆ సమయంలో హెడ్ కోచ్‌గా ఉన్న రాబ్ వాల్టర్ ఇప్పుడు ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా హెడ్ కోచ్ కావడం విశేషం!
– సాక్షి క్రీడా విభాగం


