లక్కీ కెప్టెన్‌! | Suryakumar Yadav lucky captain for team india | Sakshi
Sakshi News home page

లక్కీ కెప్టెన్‌!

Mar 9 2026 4:31 AM | Updated on Mar 9 2026 9:55 AM

Suryakumar Yadav lucky captain for team india

‘సంజు సామ్సన్‌కు మరో అవకాశం ఇస్తారా’... దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియా ప్రతినిధి ఒకరు సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్రశ్న వేశాడు. సాధారణంగా మరో కెప్టెన్‌ అయితే జట్టులోని 15 మందీ సమర్థులే. పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. మ్యాచ్‌ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటాం అని సమాధానం ఇస్తారు. కానీ సూర్యకుమార్‌ వ్యంగ్యంగా ఒకింత అహంకారంగా నవ్వుతూ... ‘అభిషేక్‌ను తీసి ఆడించమంటారా...తిలక్‌ను తీసి ఆడించమంటారా’ అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.

చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాతి మ్యాచ్‌ జింబాబ్వేపై సామ్సన్‌ను ఆడించాల్సి వచ్చింది. ఆపై వరుసగా సామ్సన్‌ అద్భుత ప్రదర్శనలే జట్టును చాంపియన్‌గా నిలిపాయి. ఫైనల్‌కు ముందు కూడా ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో బ్యాటర్ల వైఫల్యం గురించి మాట్లాడుతూ... ‘120 స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతూ కూడా ఫైనల్‌కు వచ్చామంటే అలాగే ఆడతాం’ అంటూ అర్థం లేని సమాధానం ఒకటి ఇచ్చాడు. ఒక నాయకుడిగా అతని అపరిపక్వతకు ఇవి ఒక సూచన. కానీ ఇవన్నీ ఇప్పుడు పక్కకు వెళ్లిపోతాయి.

వరల్డ్‌ కప్‌ అందించిన నాయకుడిగానే అతను గుర్తుండిపోతాడు. కెప్టెన్‌గా 52 మ్యాచ్‌లలో 40 విజయాలు చూస్తే రికార్డుపరంగా ఇది చాలా మంచి సారథ్య ప్రదర్శనే. వరల్డ్‌ కప్‌కు కొద్ది రోజుల ముందు పరిస్థితి చూస్తే వరుసగా 23 టి20 మ్యాచ్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు... సిరీస్‌పై సిరీస్‌ గెలుస్తూ వస్తున్నా కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర లేదు. కోచ్‌ గంభీర్‌ పర్యవేక్షణలో కేవలం అతని సూచనలను మైదానంలో అమలు చేసేవాడిగానే కనిపిస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా అతనికి లేదు... సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంపై గత రెండేళ్లుగా వినిపించిన విమర్శలు.

తాజాగా వరల్డ్‌ కప్‌లోనూ ‘ఇదీ కెప్టెన్‌ క్షణం’ అనిపించే వ్యూహాలు ఏమీ అతడి నుంచి రాలేదు. అంతా సానుకూలంగా సాగిపోయింది, జట్టులో అందరూ తమ బాధ్యతలు నెరవేరుస్తూ వెళుతున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూనే వచ్చాయి. అయితేనేమి భారత్‌కు ప్రపంచ కప్‌ అందించిన దిగ్గజాలు కపిల్‌ దేవ్, ధోని, రోహిత్‌ శర్మ సరసన ఇప్పుడు సూర్యకుమార్‌ కూడా నిలిచాడు. నిజానికి రోహిత్‌ రిటైర్మెంట్‌ తర్వాత టి20ల్లో సూర్య ఆటోమెటిక్‌ ప్రత్యామ్నాయం ఏమీ కాదు.

బ్యాటర్‌గా మంచి గుర్తింపు ఉన్నా నాయకుడిగా అతనికి ఎలాంటి రికార్డు లేదు. 2024 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత అప్పటి ఫామ్, సారథిగా అనుభవాన్ని బట్టి చూస్తే హార్దిక్‌ పాండ్యాకే జట్టు పగ్గాలు దక్కుతాయని అనిపించింది. అయితే క్రికెటేతర కారణాలు కావచ్చు పాండ్యాను కెప్టెన్సీ నుంచి దూరంగా పెట్టారు. అయితే బాధ్యతలు చేపట్టాక వరుస విజయాలు సూర్య కెప్టెన్సీ స్థానాన్ని పటిష్టం చేశాయి.

శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌... ఇలా ప్రతీ జట్టుపై సిరీస్‌ సాధించడంతో పాటు ఆసియా కప్‌ కూడా మన ఖాతాలో చేరింది. పేలవ ఫామ్‌ కారణంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలని చర్చ వచ్చినా వరల్డ్‌ కప్‌కు మరీ తక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ అలాంటి సాహసం చేయలేదు. వరల్డ్‌ కప్‌లోనూ టీమిండియా ప్రదర్శన ముందు అన్ని జట్లూ తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడంలో సూర్య సఫలమయ్యాడు.        

–సాక్షి క్రీడా విభాగం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement