Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు | T20 WC 2026 Final: Sanju, Abhishek Creates History Opening World Record | Sakshi
Sakshi News home page

Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు

Mar 8 2026 8:04 PM | Updated on Mar 8 2026 9:00 PM

T20 WC 2026 Final: Sanju, Abhishek Creates History Opening World Record

భారత టీ20 ఓపెనింగ్‌ జోడీ సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్‌ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్‌ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.

దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్‌ జోరు కొనసాగించారు. అభిషేక్‌ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్‌.. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్‌ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫైనల్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జోడీగా పాకిస్తాన్‌ స్టార్లు కమ్రాన్‌ అక్మల్‌- షాజైబ్‌ హసన్‌ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్‌ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్‌ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్‌ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement