‘సిలిండర్‌’ కథ తేలితేనే షెడ్యూల్‌! | No clarity yet on IPL matches | Sakshi
Sakshi News home page

‘సిలిండర్‌’ కథ తేలితేనే షెడ్యూల్‌!

Mar 11 2026 1:41 AM | Updated on Mar 11 2026 1:41 AM

No clarity yet on IPL matches

ఐపీఎల్‌ మ్యాచ్‌లపై ఇంకా రాని స్పష్టత

న్యూఢిల్లీ: ఐపీఎల్‌–2026 ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్త ఇది. ప్రచార ప్రకటనల హోరు కనిపిస్తున్నా అసలు మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ తెలియదు. మార్చి 28 అని వినిపించినా దానిని కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. షెడ్యూల్‌ విషయంలో అభిమానులకు మాత్రమే కాదు అసలు బీసీసీఐ అధికారులకే స్పష్టత లేదు! మధ్య ప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం కూడా దీనికి ఒక కారణం. 

గల్ఫ్‌లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్‌ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో హోటల్స్‌లో వాడే కమర్షియల్‌ సిలిండర్‌లు దొరకడం సమస్యగా మారిపోయింది. ఐపీఎల్‌ సమయంలో హోటల్స్‌లో బస చేసే ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, టోర్నీ నిర్వహణలో భాగంగా ఉండే ఎంతో మందికి భోజనం తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సిలిండర్‌లు కావాల్సిన సంఖ్యలో అందుబాటులో లేకపోతే మొత్తం వ్యవస్థ అంతా దెబ్బ తింటుంది. 

తాజాగా బెంగళూరు హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా తమకు సిలిండర్ల కొరత బాగా ఉందని ఇప్పటికే చెప్పగా... ముంబైలో 20 శాతం హోటల్స్‌ తమ వ్యాపారానికి విరామం ఇచ్చాయి. ఈ సమస్యను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ కూడా అంగీకరించారు. ‘గ్యాస్‌ సిలిండర్ల విషయంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నాం. మార్చి 28 వరకు అంతా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. 

అలా కాకుండా ఇదే సమస్య అప్పటికీ కొనసాగితే మేం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌తో సంబంధం ఉన్న అందరిపై దీని ప్రభావం ఉంటుంది’ అని ధుమాల్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అంతా స్పష్టత వచ్చాకే ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement