టి20 ప్రపంచకప్ విజేతకు బీసీసీఐ భారీ నజరానా
మొత్తం రూ.131 కోట్ల బహుమతి ప్రకటన
న్యూఢిల్లీ: టి20 వరల్డ్ కప్ విజేతలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు పురస్కారంతో ఘనంగా గౌరవించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని చాంపియన్ టీమ్‌కు మొత్తం రూ.131 కోట్ల నగదు పురస్కారాన్ని అందిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘వరల్డ్ కప్ సొంతం చేసుకున్న ఆటగాళ్లను, వారికి అండగా నిలిచిన సహాయక సిబ్బంది, సరైన జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లకు అభినందనలు. మున్ముందూ జట్టు ఇలాంటి మరెన్నో విజయాలు అందుకోవాలి’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు.
బోర్డు ప్రకటించిన మొత్తంలో ఆటగాళ్లకు ఎంత ఇస్తారనేది అధికారికంగా ప్రకటించకపోయినా... ఇందులో రూ. 90 కోట్లను 15 మంది జట్టు సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఒక్కో క్రికెటర్‌కు రూ. 6 కోట్లు చొప్పున లభిస్తాయి. మిగతా రూ.41 కోట్లను హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌లతో పాటు సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యులకు వారి హోదాల ప్రకారం పంచుతారు. 2024లో భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా బోర్డు భారీ మొత్తాన్ని (రూ. 125 కోట్లు) బహుమతిగా అందించింది.
వారి సరసన చేరడం గౌరవం: సూర్యకుమార్
భారత్‌కు టి20 వరల్డ్ కప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ధోని, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత అతనికే దక్కింది. అలాంటి క్రికెటర్ల సరసన తన పేరు కూడా చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సూర్యకుమార్ అన్నాడు. ‘వరుసగా రెండు వరల్డ్ కప్‌లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం గెలిచినప్పుడే మేం దానిని పునరావృతం చేయాలని భావించాం. జట్టు మంచి జోరు మీదుంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణంతో పాటు పాటు అదే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్‌లో మళ్లీ గెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
ధోని, రోహిత్‌లవంటి గొప్ప కెప్టెన్‌లతో నన్ను పోల్చడం చాలా గర్వంగా ఉంది. మున్ముందు కూడా మరిన్ని విజయాలు జట్టుకు అందించాలని కోరుకుంటున్నా. టోర్నీ ఆరంభానికి ముందు ధోనితో మాట్లాడా. సన్నాహాలకు సంబంధించి అతను ఇచ్చిన సూచనలు చాలా బాగా పని చేశాయి’ అని సూర్యకుమార్ అన్నాడు. ఫైనల్ ముగిశాక మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు తమ సంబరాలు కొనసాగాయని అతను వెల్లడించాడు.
ఆటగాళ్లకు ఘనస్వాగతం...
వరల్డ్ కప్ విజయంలో భాగమైన క్రికెటర్లు అహ్మదాబాద్ నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. సోమవారమే సంజు సామ్సన్‌కు తిరువనంతపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించగా... మంగళవారం పట్నా ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఇషాన్ కిషన్‌కు భారీ స్థాయిలో వెల్‌కమ్ చెప్పారు.

టోర్నీలో 317 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘భారత జట్టు గెలుపు, నేను అందులో సభ్యుడిని కావడం చాలా గొప్పగా ఉంది. దేశం మొత్తం గర్వించే క్షణమిది. నేను నా ఆటతోనే అందరికీ స్ఫూర్తిగా నిలవాలని భావిస్తున్నా’ అని విమానాశ్రయంలో కిషన్ చెప్పాడు.


