కోహ్లీ అందుకే రాలేకపోయాడా! | Know Reason Behind Why Virat Kohli Not Attend T20 World Cup Final Match, Fans Debate On Social Media | Sakshi
Sakshi News home page

కోహ్లీ అందుకే రాలేకపోయాడా!

Mar 10 2026 4:08 PM | Updated on Mar 10 2026 4:22 PM

Reason Behind Why Virat Kohli Not Attend T20 World Cup Final Match

సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌కు అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా మాజీ కెప్టెన్లు ఎంఎస్‌ ధోనీ, రోహిత్‌ శర్మ హాజరైన సంగతి తెలిసిందే. అయితే కింగ్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం ప్రపంచప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రాకపోవడం వెనుక సోషల్‌ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతున్నది. కోహ్లీ రాకపోవడం వెనుక అభిమానులు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. 

ధోనీ, రోహిత్‌లు కెప్టెన్‌లుగా ఐసీసీ ట్రోఫీలు సాధించారని, కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్‌గా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడని, అందుకే తాజా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా 2007 తొలి టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టుకు ధోనీ సారథ్యం వహించగా, అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన టీమిండియాకు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ 2017 చాంపియన్స్‌ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్‌, 2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌, 2021 టీ20 ప్రపంచకప్‌ వంటి మేజర్‌ టోర్నీల్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ టైటిల్‌ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. 

మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్‌లో స్థిరపడిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో క్రికెట్‌ ఆడినంత కాలం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు. తాజాగా ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావడంతో కుటుంబంతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని, అందుకే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ వీక్షించేందుకు అహ్మదాబాద్‌కు రాలేకపోయాడని పలువురు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.  ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు అంతకముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీలు తమ కుటుంబాలతో కలిసి వీక్షించేందుకు వచ్చారు.  కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే ఆడుతున్న కోహ్లీ గత జనవరిలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ సెంచరీ సహా అర్థసెంచరీ సాధించి జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచి తన ఫామ్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు.

చదవండి: ఐపీఎల్‌ 2026పై బిగ్‌ అప్‌డేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement