భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్ మిశ్రా భారత్ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ఆడాడు.
2013-14 రంజీ సీజన్‌లో ఉత్తర్‌ప్రదేశ్ తరఫున రెండో మ్యాచ్‌లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్ మిశ్రాను 2014 ఐపీఎల్ ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్‌లో చేరినా, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు.
ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది.
మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు.
మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్‌ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు.
కాగా, గరిమా అమిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది.


