టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్‌పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్ యువ కెరటం జేకబ్ బేతెల్‌కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్ కోసం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో బేతెల్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్ యాజమాన్యం ప్రకటించింది.
22 ఏళ్ల బేతెల్‌కు గతంలో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన రికార్డు బేతెల్ వశమైంది.
ఫీనిక్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బేతెల్ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
బేతెల్ తాజాగా భారత్‌తో జరిగిన పొట్టి ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.
ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో బేతెల్ 8 ఇన్నింగ్స్‌ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.
ఐపీఎల్‌లో సవాలు
హండ్రెడ్ లీగ్‌లో బేతెల్‌కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్‌లో బేతెల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్‌లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి.


