ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హేమంగ్ బదానీకి మరో కీలక పదవి దక్కింది. హండ్రెడ్ లీగ్‌లోని సదరన్ బ్రేవ్ పురుషుల ఫ్రాంచైజీ కూడా అతన్నే హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ రెండు ఫ్రాంచైజీలకు GMR గ్రూప్ సహ యజమానిగా ఉంది. బ్రేవ్ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా (అసిస్టెంట్ కోచ్) ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్‌ను ఎంపిక చేసింది.
GMR గ్రూప్‌కు ఐపీఎల్ హండ్రెడ్ లీగ్‌తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (Seattle Orcas), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (Dubai Capitals) కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి.
సదరన్ బ్రేవ్ గత ప్రదర్శనలు
సదరన్ బ్రేవ్ ఫ్రాంచైజీ హండ్రెడ్ లీగ్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. ఆతర్వాత 2024 ఎడిషన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్‌లో మాత్రం సగం మ్యాచ్‌లు ఓడి, నాకౌట్స్‌కు కూడా చేరలేకపోయింది.
కాగా, హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్, సన్‌రైజర్స్ లీడ్స్ పోటీపడనున్నాయి. జులై 22న జరిగే మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ వెల్ష్ ఫైర్‌తో తలపడుతుంది.
తొలిసారి వేలం
హండ్రెడ్ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్ల ఎంపిక జరుగనుంది. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో జరుగనుంది. 18 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లు వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పోటీపడతాయి.


