యుద్దం వేళ భారీ ట్విస్ట్‌.. ఇరాన్‌కు ఉత్తర కొరియా మద్దతు | North Korea And China Condemn US And Israel Strikes, Welcome Iran’s New Supreme Leader Mojtaba Khamenei | Sakshi
Sakshi News home page

యుద్దం వేళ భారీ ట్విస్ట్‌.. ఇరాన్‌కు ఉత్తర కొరియా మద్దతు

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 10:00 AM

North Korea says Supports election of Iran new Supreme Leader

ప్యాంగ్‌యాంగ్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా భీకర దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ఎన్నికపై తాజాగా ఉత్తర కొరియా స్పందించింది. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఎన్నికను ఉత్తర కొరియా స్వాగతించింది. అదే సమయంలో పశ్చిమాసియా దేశంపై చట్టవిరుద్ధమైన దాడులకు ఇజ్రాయెల్, బద్ధ శత్రువు అమెరికాను విమర్శించింది.

ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా ఓ ప్రకటనలో.. ఇరానియన్లు తమ నాయకుడిని ఎన్నుకునే హక్కును ఉత్తర కొరియా గౌరవిస్తుందని పేర్కొంది. అలాగే, ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు చట్ట విరుద్ధం. ఇరాన్‌పై వారి సైనిక చర్యలు, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరైంది కాదు. ఇరాన్‌ సామాజిక వ్యవస్థను పడగొట్టే ప్రయత్నం చేయడమేంటి?. ఇవి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నాశనం చేయడంతో పాటుగా అస్థిరతను పెంచుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మోజ్తాబా ఖమేనీ భద్రతపై ఆందోళన పెరుగుతోంది. దీనిపై చైనా (china) తాజాగా స్పందించింది. మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్‌లో హత్యకు గురైన తండ్రి అలీ ఖమేనీ వారసుడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపుల నేపథ్యంలో ఆయనను లక్ష్యంగా చేసుకోవడంపై తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా తెలిపింది. మోజ్తాబా ఖమేనీని నియమించాలనే ఇరాన్ నిర్ణయాన్ని వారి అంతర్గత విషయంగా చైనా పేర్కొంది.

ఏ సాకుతోనైనా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత , ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఇజ్రాయెల్ కు హితవు పలికారు. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా మోజ్తాబా పేరును ఖరారు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను చైనా గతంలో చట్టవిరుద్ధమైన దురాక్రమణగా ఖండించింది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement