పశ్చిమాసియా సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్న ఇరువురు నేతలు
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు సంభాషణ సాగింది. ఇరాన్–అమెరికా, ఉక్రెయిన్–రష్యా సంఘర్షణలపై ఇరువురు నేతలు చర్చించినట్లు రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభంతోపాటు ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం కొనసాగుతున్న మాస్కో–వాషింగ్టన్–కీవ్ చర్చలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ స్వేచ్ఛాయుతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు.
ఇరాన్‌లో జరుగుతున్న యుద్ధం పట్ల పుతిన్ తన అభిప్రాయాలు వ్యక్తంచేశారని, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తోపాటు గల్ఫ్ దేశాల నాయకులతో గతవారం జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్‌కు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ట్రంప్ సైతం తాజా పరిణామాలపై తన మనసులో మాటను పుతిన్‌తో పంచుకున్నారని స్పష్టంచేశారు. ఈ ఏడాది ట్రంప్, పుతిన్ ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది 11వ సారి కావడం విశేషం. భారత్, చైనాలతోపాటు యూరప్‌లోని మిత్రదేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
యుద్ధానికి త్వరలోనే ముగింపు
ఇరాన్‌పై యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందని తాను అంచనా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్‌పై గత పది రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని ‘స్వల్పకాలిక విహారయాత్ర’గా అభివర్ణించారు. ఆయన తాజాగా ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌లో ఇప్పటిదాకా 5,000 లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని వెల్లడించారు. త్వరలోనే యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం ఉందన్నారు.
చమురు సరఫరాను అడ్డుకుంటే ఖబడ్దార్
హొర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం కలిగిన పాలకులు ప్రపంచ దేశాలకు ఇబ్బందులు సృష్టిస్తామంటే సహించబోమని అన్నారు. చమురు సరఫరాను అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దని సూచించారు. హొర్మూజ్‌లో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా.. ఇప్పటిదాకా ఇరాన్ చేసిన దాడి కంటే 20 రెట్లు బలంగా ఆ దేశాన్ని దెబ్బకొడతామని తేల్చిచెప్పారు. హొర్మూజ్‌లో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, ఇది చైనాకు, ఇతర దేశాలకు తాము ఇస్తున్న బహుమతి అని వ్యాఖ్యానించారు.
ఒక్క లీటర్ కూడా రవాణా చేయలేరు: ఇరాన్
ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్‌జీసీ) మంగళవారం ఘాటుగా స్పందించింది. హొర్మూజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ చమురు కూడా రవాణా చేయలేరని తేల్చిచెప్పింది. తమదేశంపై దాడులు ఇలాగే కొనసాగితే హొర్మూజ్ నుంచి చమురు రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టంచేసింది.


