ట్రంప్‌ను ఖతం చేస్తాం: ఇరాన్ సంచలనం | "Beware, Lest You Be Eliminated": Iran Threatens Trump After He Warns Mojtaba | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను ఖతం చేస్తాం: ఇరాన్ సంచలనం

Mar 10 2026 10:07 PM | Updated on Mar 10 2026 10:12 PM

"Beware, Lest You Be Eliminated": Iran Threatens Trump After He Warns Mojtaba

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. “నిన్ను మించిన వారికి కూడా ఇరాన్‌ను నాశనం చేయడం సాధ్యం కాలేదు. జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వే ఖతం అవుతావు” అని అన్నారు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీని డొనాల‍్డ్‌ ట్రంప్‌ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భద్రతా విభాగ అధిపతి అలీ లారిజాని పై విధంగా స్పందించారు.

కాగా, ‘హోర్ముజ్ జలసంధి ద్వారా ఇరాన్‌ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే గత దాడుల కంటే అమెరికా 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో దాడులు చేస్తుంది. ఇస్లామిక్ రిపబ్లిక్ మళ్లీ ఎప్పటికీ పునర్నిర్మాణం కాలేదు. అంతలా ఆ దాడులు ఉంటాయి’ అని తెలిపారు. కానీ, అలా జరగకూడదని తాను ఆశిస్తూ, ప్రార్థిస్తున్నానని అని ట్రంప్ అన్నారు.

మొజ్తాబాను కూడా ట్రంప్‌ హెచ్చరిస్తూ ఆయన ప్రశాంతంగా జీవించలేరని చెప్పారు. ఇరాన్ ఎంచుకున్న లీడర్‌ తనకు నచ్చలేదని ట్రంప్‌ చెప్పారు. అలీ ఖమేనీ రెండో కుమారుడిని కొత్త నాయకుడిగా ఎన్నుకోవడంపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోజ్తబా ఖమేనీ నియామకానికి ముందు ట్రంప్ స‍్పందిస్తూ.. ఇరాన్ తదుపరి నాయకుడి ఎంపికలో అమెరికా పాత్ర కూడా ఉండాలని చెప్పారు. గతంలో వెనెజువెలా విషయంలో అమెరికా జోక్యం ఉన్నట్లే ఇప్పుడూ ఇరాన్‌ విషయంలో ఉండాలని అన్నారు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది.

హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ఎగుమతులు నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హోర్ముజ్ జలసంధి నుంచి ఒక లీటర్ చమురు కూడా ఎగుమతి కాకుండా అడ్డుకుంటామని చెప్పింది. పర్షియన్ గల్ఫ్ సముద్రం నుంచి ప్రపంచానికి చమురు రవాణా జరిగే అత్యంత కీలక సముద్ర మార్గమే హోర్ముజ్ జలసంధి.

ఈ యుద్ధంలో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. మంగళవారం ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై దాడులు కొనసాగించడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరిగింది.

బహ్రెయిన్ రాజధాని మనామాలో ఇరాన్ దాడి ఒక నివాస భవనాన్ని తాకింది. 29 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఎనిమిది మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా తూర్పు చమురు ప్రాంతంపై వచ్చిన 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. కువైట్ నేషనల్ గార్డ్ 6 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రువైస్ పారిశ్రామిక సిటీలో డ్రోన్ దాడి తర్వాత అగ్ని ప్రమాదం చెలరేగింది. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో సైరన్లు మోగాయి. టెల్ అవీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ నుంచి వచ్చిన దాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు పని చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement