T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ | ICC breaks silence on travel bias allegations WI SA Delayed Departures | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Mar 11 2026 1:37 PM | Updated on Mar 11 2026 1:57 PM

ICC breaks silence on travel bias allegations WI SA Delayed Departures

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్‌–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్‌ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.

పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు
కానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్‌ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్‌ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. 

చార్టర్‌ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్‌ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.

చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫ్లయిట్‌లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం 
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్‌ హెడ్‌కోచ్‌ డారెన్‌ సామీ, ప్లేయర్‌ ఆకీల్‌ హొసేన్‌ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. 

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్‌, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.

మేము అర్థం చేసుకోగలం
ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.

వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్‌ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.

మా ఆధీనంలో లేవు
ఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్‌ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్‌ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.

ఇక ఐసీసీ వర్గాలు మైకేల్‌ వాన్‌ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్‌ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్‌ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.

వారు మాత్రం ఇక్కడే
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ సీజన్‌ కోసం పలువురు వెస్టిండీస్‌ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్‌మన్‌ పావెల్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), రూథర్‌ఫర్డ్‌ (ముంబై ఇండియన్స్‌), హెట్‌మైర్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), రొమారియో షెఫర్డ్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.

చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement