హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్‌తో మాట్లాడుతున్న బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
బీజేపీ నేతను హౌస్ అరెస్ట్ చేయించిన కదిరి టీడీపీ ఎమ్మెల్యే
రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి
మంత్రి లోకేశ్‌తో మాట్లాడిన మాధవ్
ఇదేదో చూడండంటూ మరో మంత్రికి అప్పగించి చేతులు దులుపుకున్న లోకేశ్
కదిరి: మిత్రపక్షమైన బీజేపీకి కనీస విలువ ఇవ్వకుండా టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుండటంతో కమలనాథులు భగ్గుమన్నారు. అధికారంలో పాలుపంచుకున్నారనే విషయాన్ని మరిచి బీజేపీ నేతలపై కక్షసాధింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ నేత పాల్గొనకూడదని శ్రీసత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతటితో ఆగక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డిని ఏకంగా హౌస్ అరెస్ట్ చేయించడం ఇరుపార్టీ ల మధ్య వివాదాన్ని రగిల్చింది.
వివరాల్లోకి వెళితే.. ఆధిపత్యం కోసం తంటాలు పడుతున్న కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డిని కట్టడి చేసేందుకు ఏకంగా పోలీసులను ప్రయోగించారు. మంగళవారం జరిగిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు బీజేపీ నేత విష్ణువర్ధన్‌కు అనుమతి ఇవ్వకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేయించారు. రథోత్సవంలో పాల్గొనవద్దని బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే గత నెలలోనే హుకుం జారీ చేశారు. దాంతో ఇది ఆధిపత్య పోరుకు దారి తీసింది.
కల్యాణోత్సవం రోజు నుంచే కుట్ర
ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత నెల 28న శ్రీవారి కల్యాణోత్సవం జరిగింది. ఆ రోజు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే కందికుంట కంటపడ్డారు. ఆయన్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారంటూ పోలీసులతో పాటు ఆలయ అధికారులపై ఆ రోజే ఎమ్మెల్యే కందికుంట ఆగ్రహం వ్యక్తం చేశారు.
రథోత్సవం రోజున విష్ణు కనబడితే ఊరుకునేది లేదని పోలీసులకు హెచ్చరించినట్లు సమాచారం. మంగళవారం రథోత్సవంలో విష్ణును కనీసం తిరువీధుల్లోకి కూడా రానివ్వకుండా పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయించినట్టు తెలుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కదిరిలో కందికుంట రాజ్యాంగం అమలవుతోంది.
రెండేళ్లుగా బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిని బ్రహ్మోత్సవాల్లో రథంపైకి రాకుండా ఎమ్మెల్యే ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారు. గత ఏడాది సైతం రథోత్సవం నాడు ఆయనను ఊరిలోకి రాకుండా పోలీసుల ద్వారా ముందే హెచ్చరికలు జారీ చేయించి ఇక్కడ కందికుంట రాజ్యాంగాన్ని అమలు చేయించారు. ఒకవేళ వస్తే తేరుపై నుండి కిందికి తోసేయడం ఖాయమని హెచ్చరికలు జారీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
‘ఇక్కడ రాజకీయం ఎలా చేయాలో నాకు తెలుసు’
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ వర్గాలు పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి లోకేశ్ శ్రీసత్యసాయి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా కదిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేయించారు. ‘కూటమి పార్టీ నేతలతో ఇలా వ్యవహరిస్తే ఎలా?’ అని మంత్రి అనడంతో ‘నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఇక్కడ రాజకీయం ఎలా చేయాలో నాకు తెలుసు’ అంటూ ఎమ్మెల్యే కందికుంట ఫోన్ కట్ చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కాగా, టీడీపీ వైఖరితో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
దేవుడి దగ్గర రాజకీయం చేస్తావా?
కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరిలో వ్యక్తిగత స్వార్థం కోసం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. నేను 30 ఏళ్లుగా ఏటా రథోత్సవం నాడు రథం కదలికలను భక్తులకు తెలియజేస్తూ ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నా. ఈసారి నన్ను తేరుపైకి రాకుండా ముందురోజు రాత్రే నా ఇంటికి పోలీసు అధికారులను పంపారు. నేను అక్కడికి వెళితే గొడవలవుతాయని, అక్కడ ప్రాణహాని కూడా ఉందని పోలీసులతో చెప్పించారు.
ఉదయాన్నే నా ఇంటి ముందు భారీగా పోలీసులను మోహరింపజేసి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేయించారు. దేవుడి దగ్గర ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే నాశనమైపోతారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు క్షమించరు. – ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ నేత


