సెలవుపూటా శా‘శిస్తు’న్నారు | Officials are angry about why taxes are not being collected | Sakshi
Sakshi News home page

సెలవుపూటా శా‘శిస్తు’న్నారు

Mar 11 2026 2:35 AM | Updated on Mar 11 2026 2:35 AM

Officials are angry about why taxes are not being collected

సంజాయిషీ లేఖలు ఇచ్చేందుకు రాత్రివేళ డీపీఓ కార్యాలయం వద్ద వేచి ఉన్న పంచాయతీ కార్యదర్శులు

బాబు పాలనలో పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర వేధింపులు 

పన్నులు ఎందుకు వసూలు చేయలేదంటూ అధికారుల ఆగ్రహం 

సంజాయిషీ ఇవ్వాలని డీపీఓ కార్యాలయానికి పిలిపించి మరీ తలంటు 

సెల్‌ఫోన్‌ వెలుగుల్లో రాత్రి 8 గంటల వరకు సంజాయిషీ లేఖలు రాసిచ్చిన ఉద్యోగులు

విజయనగరం రూరల్‌: చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోంది. పన్నులు, శిస్తులు వసూలు చేయాలని ఉన్న­తాధికారులు సెలవుపూటా శాశిస్తున్నారు. లేకపోతే సంజాయిషీ లేఖలు ఇవ్వాలని వేధిస్తు­న్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజయన­గరం జిల్లాలో గత ఆదివారం పన్నులు వసూలు చేయలేదని 260 మంది పంచాయతీ కార్య­దర్శులపై జిల్లా పంచాయతీ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నోటీసులు జారీ చేసి మంగళవారం తన కార్యాలయానికి పిలిపించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే ఉంచేశారు. చీకటి పడినా వదల్లేదు. సంజాయిషీ లేఖలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో చెట్ల కింద సెల్‌ఫోన్‌ వెలుగులోనే సంజాయిషీ లేఖలు రాసి కార్యదర్శులు డీపీఓ కార్యాలయంలో అందజేశారు. ఇదేం టార్చర్‌ అంటూ లబోదిబోమన్నారు. మహిళా కార్యదర్శులు అయితే తీవ్ర ఇబ్బంది పడ్డారు. తిరిగి ఇళ్లకు ఒంటరిగా వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. డిజిటల్‌ విధానంలో పన్ను వసూలుకు ఇబ్బందులు ఎదురవు­తున్నాయని చెబుతున్నా అధికారులు వినిపించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమపై విపరీతంగా పనిభారం పెంచేశారని, ఉదయం ఏడు గంటల్లోపే గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్య పనులు పరిశీలించి యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాలని హుకుం జారీ చేశారని, ఆ తర్వాత కార్యాలయంలో విధులు, ఆ తర్వాత పన్నుల వసూలు బాధ్యతలు అప్పగించారని అయినా అష్టకష్టాలు పడుతూ పనిచేస్తు­న్నామని గగ్గోలు పెట్టారు. తమకు పైనుంచి ఒత్తిడి ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారని, ఒక్కోరోజు పన్నులు వసూలు కాకపోతే తామేం చేస్తామని కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. సర్కారు తీరును దుయ్యబడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement