హోటల్‌ రంగాలపై యుద్ధ ప్రభావం | Center imposes restrictions on cooking gas | Sakshi
Sakshi News home page

హోటల్‌ రంగాలపై యుద్ధ ప్రభావం

Mar 11 2026 2:48 AM | Updated on Mar 11 2026 5:20 AM

Center imposes restrictions on cooking gas

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా పశ్చి మాసియాలో కమ్ముకున్న యుద్ధ వాతావరణం ఆతిథ్యం, హోటల్‌ రంగాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఆంక్షలు, తీవ్ర కొరతతో పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరులో హోటళ్ల రంగం సమ్మెబాట పట్టగా ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండు వేలకు పైగా స్టార్‌ హోటళ్లు, మూడు వేలకుపైగా రెస్టారెంట్లతో పాటు చిరువ్యాపారులతో కలిపి 20 – 25 వేల హోటళ్లు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. 

నిత్యం 50 వేల వరకు వాణిజ్య సిలిండర్లను విని యోగిస్తుండగా.. తాజా అనిశ్చితి మధ్య వాణిజ్య సిలిండర్ల సరఫరా 40 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఏపీలో అత్యవసరానికి కూడా వాణిజ్య సిలిండర్లు దొరకట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్ల వ్యాపారాలు మూతపడి లక్షలాది మంది జీవనంపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్ల సరఫరాకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

బ్లాక్‌ మార్కెట్‌ దందా
గ్యాస్‌ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు అమలు చేస్తున్నాయని, దీంతో ఇదే అదునుగా రాష్ట్రంలో బ్లాక్‌ మార్కెట్‌ దందాకు తెర తీశారని హోటళ్ల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం ఒక్కో వాణిజ్య సిలిండర్‌పై రూ.115 చొప్పున పెంచింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్‌ రూ.2500– రూ.3 వేల వరకు బ్లాక్‌ మార్కెట్‌ దందా నడుస్తోందని ఆరోపిస్తున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టాలని ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

వినియోగదారులపై తీవ్ర ప్రభావం
వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత హోటళ్ల రంగంతో పాటు వినియోగదారులను కుదేలు చేసేలా కనిపిస్తోంది. గ్యాస్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తే తోపుడు బండ్లపై తినే ఇడ్లీ దగ్గర పెద్ద పెద్ద రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలో మెనూ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది చివరకు జనంపైనే పడుతుంది. రాష్ట్రంలో నెలకు 84 లక్షలకుపైగా గృహ, వాణిజ్య వినియోగ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ఇందులో 10 శాతానికిపైగా వాణిజ్య సిలిండర్లే ఉన్నాయి. కాగా,  గ్యాస్‌ ఏజెన్సీల లెక్కల ప్రకారం ఏపీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు మరో రెండు వారాలకు వరకు సరిపోతాయని తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో కేంద్రం గ్యాస్‌ బుకింగ్‌ కాల పరిమితిని 21 నుంచి 25 రోజులకు పెంచింది. కాగా, బ్లాక్‌ మార్కెట్‌లో వాణిజ్య సిలిండర్ల దందాను వెంటనే అరికట్టాలని విజయవాడ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రమణ, స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ వీరాస్వామి కోరారు. కొరత భయంతో బుకింగ్‌లు పెరగడం వల్ల సరఫరాలో స్వల్ప ఆలస్యం అవుతోందని ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. 

ఎల్పీజీ గ్యాస్‌ కొరత లేదు : మంత్రి నాదెండ్ల 
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారాన్ని చూసి భయపడొద్దని సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement