ఇక ‘టోల్‌’ తీసే బాధ్యత మహిళలకే.. | Over 5100 Women to be Employed at Toll Plazas Across India | Sakshi
Sakshi News home page

ఇక ‘టోల్‌’ తీసే బాధ్యత మహిళలకే..

Mar 14 2026 12:42 PM | Updated on Mar 14 2026 12:47 PM

Over 5100 Women to be Employed at Toll Plazas Across India

న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనున్నట్లు ప్రకటించింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు.

నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హైవే మౌలిక సదుపాయాల రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. టోల్ బూత్‌ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.

సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య జరిగే వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. ప్రశాంతమైన, వృత్తిపరమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నేషనల్ హైవేస్ అథారిటీ పలు కీలక భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపింది. ఎన్‌హెచ్‌బీఎఫ్‌, హెచ్‌ఓఏఐ, ఏఐటీయూసీ తదితర సంఘాలతో పాటు టోల్ ఆపరేటర్లు కూడా ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ వినూత్న కార్యక్రమం అమలునునేషనల్ హైవేస్ అథారిటీ  నిరంతరం పర్యవేక్షించనుంది. విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి ముందుగానే ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా వారికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, టోల్ ఆపరేషన్లలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించడం, భద్రతా నియమాలపై అవగాహన తదితర అంశాల్లో శిక్షణ అందించనున్నారు.

ఇది కూడా చదవండి: సోనమ్ వాంగ్‌చుక్‌ విడుదల

Advertisement
 
Advertisement
Advertisement