ఆనందంగా దూకింది.. సాహస యాత్రే చివరి యాత్ర.. | without safety line rope jump Woman dies in Brazil | Sakshi
Sakshi News home page

ఆనందంగా దూకింది.. సాహస యాత్రే చివరి యాత్ర..

Jun 14 2026 8:34 AM | Updated on Jun 14 2026 12:10 PM

without safety line rope jump Woman dies in Brazil

అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువతి(21) నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. 40 మీటర్ల ఎత్తున్న రోప్ జంప్ (Rope Jump) ఈవెంట్‌లో పాల్గొన్న యువతికి భద్రతా తాడును కట్టకుండానే వంతెన పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

వివరాల మేరకు.. ఈ ఘటనలో మృతురాలిని మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్ (21)గా గుర్తించారు. ఆమె బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని లిమీరా ప్రాంతంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన మరియా, రోప్ జంప్ అనుభవాన్ని ఆస్వాదించాలని అనుకుంది. ఈ క్రమంలో రోప్ జంప్‌కు ముందు యువతికి హార్నెస్, ఇతర భద్రతా పరికరాలు అమర్చారు. అయితే అత్యంత కీలకమైన ప్రధాన సేఫ్టీ తాడును హార్నెస్‌కు అనుసంధానం చేయడం నిర్వాహకులు మర్చిపోయినట్లు తెలుస్తోంది.

జంప్‌నకు సిద్ధమైన మరియాను ఇద్దరు సిబ్బంది వంతెన అంచుకు తీసుకెళ్లారు. కౌంట్‌డౌన్ ముగిసిన తర్వాత ఆమెను దూకించారు. అయితే ఆమె గాల్లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే అక్కడ ఉన్న కొందరు సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు "తాడు లేదు... తాడు లేదు..." అంటూ అరవడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. అప్పటికే యువతి నేరుగా కిందపడిపోయింది. సుమారు 40 మీటర్ల (130 అడుగులకు పైగా) ఎత్తు నుంచి కిందపడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఘటనాస్థలంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

వైరల్‌గా మారిన వీడియో..
ఈ ప్రమాదం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డయింది. అనంతరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో యువతి ఉత్సాహంగా జంప్‌కు సిద్ధమవడం, దూకిన తర్వాత సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురవడం కనిపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా తనిఖీ చేసి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా? జంప్‌కు ముందు తప్పనిసరి చెక్‌లిస్ట్ అమలు చేశారా? అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement