లేహ్/జోధ్‌పూర్: లడఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ప్రముఖ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లేహ్‌లో జరిగిన హింసాత్మక నిరసనల దరిమిలా ఆయనను జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ)కింద అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్న వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
శాంతి స్థాపన కోసమే ఈ నిర్ణయం
లడఖ్‌లో శాంతి, స్థిరత్వం పెంపొందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, ఆందోళనలను పరిష్కరించేందుకు, అన్ని వర్గాలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. గతంలో ప్రజా శాంతికి భంగం కలగకుండా ఉండేందుకే వాంగ్‌చుక్‌ను నిర్బంధించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది.
పరిశ్రమలు, పర్యాటకంపై ప్రభావం
లడఖ్‌లో నిరంతర బంద్‌లు, నిరసనల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపిందని, ఈ వాతావరణాన్ని మార్చేందుకే వాంగ్‌చుక్ విడుదలకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
‘న్యాయ పోరాటం ఫలించింది’
వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో తన భర్త నిర్బంధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్త ఎప్పుడూ అహింసా మార్గాన్నే కోరుకున్నారని అన్నారు. హింస వల్ల లడఖ్‌లో తన ఐదేళ్ల ‘తపస్సు’ వృథా అవుతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో కూడా పేర్కొన్నారని ఆమె కోర్టుకు విన్నవించారు. వాంగ్‌చుక్ విడుదలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆయన మద్దతుదారులకు ఆనందాన్నిచ్చింది.


