ఖాన్ సార్ కేసులో ఊహించని మలుపు | Khan Sir Controversy: Absconding Accuseds Brother Dies Suspiciously in Nepal Hotel | Sakshi
Sakshi News home page

ఖాన్ సార్ కేసులో ఊహించని మలుపు

Jun 14 2026 1:10 PM | Updated on Jun 14 2026 1:45 PM

Khan Sir Controversy: Absconding Accuseds Brother Dies Suspiciously in Nepal Hotel

పట్నా: బిహార్‌లోని పట్నా కోచింగ్ సెంటర్ల వివాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖాన్ సార్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ గొడవలో నిందితుడిగా ఉంటూ, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ప్రిన్స్ యాదవ్ నేపాల్‌లోని ఒక హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. జ్ఞాన్ బిందు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రోషన్ ఆనంద్ సోదరుడే ఈ ప్రిన్స్ యాదవ్. ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నేపాల్ హోటల్‌లో కలకలం
ప్రిన్స్ యాదవ్ మరణించిన సమయంలో అతడితో పాటు హోటల్ గదిలో ఉన్న కొంతమంది యువకులను నేపాల్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ప్రిన్స్ యాదవ్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని నేపాల్ అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

పట్నా జైల్లో అన్న.. నేపాల్‌లో తమ్ముడు
జూన్ 2వ తేదీన పట్నాలోని ఫైసల్ ఖాన్ అలియాస్ ఖాన్ సార్‌కు చెందిన ‘ఖాన్ గ్లోబల్ స్టడీస్’ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై దాడి, లూటీ కేసులో జ్ఞాన్ బిందు డైరెక్టర్ రోషన్ ఆనంద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను పట్నా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దాడి కేసుతో సంబంధం ఉన్నందుకే రోషన్ ఆనంద్ తమ్ముడైన ప్రిన్స్ యాదవ్ నేపాల్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇంతలోనే అతను శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది.

జూన్ 20 వరకు ఖాన్ సార్‌కు ఊరట
ఈ సంచలన వివాదంలో ప్రముఖ యూట్యూబర్, కోచింగ్ సెంటర్ అధినేత ఖాన్ సార్‌ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఖాన్ సార్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఖాన్ సార్ అరెస్ట్‌పై జూన్ 20 వరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు అన్న జైల్లో ఉండటం, ఇటు తమ్ముడు అనుమానాస్పదంగా మరణించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement