కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన మమతకు ఊహించని షాకిచ్చింది.
అయితే, వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. తాను బరాసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఎంసీ టికెట్ కోరినట్లు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ లీగల్ నోటీసులు మమతా బెనర్జీతో పాటు టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, అలాగే పార్టీ నాయకురాలు సోనాలీ గుహలకు పంపినట్లు సమాచారం.
నాపై తప్పుడు ప్రచారం..
ఇటీవల టీఎంసీలో చెలరేగిన అంతర్గత విభేదాల సందర్భంగా కకోలి ఘోష్ దస్తిదార్ తిరుగుబాటుకు కారణం తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమేనని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలను బైద్యనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా..‘నా కోసం నా తల్లి ఎమ్మెల్యే టికెట్ అడిగిందనడం వంద శాతం అబద్ధం. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులను లాగడం సరైంది కాదు’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లీగల్ నోటీసులో భాగంగా తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువునష్టం కేసులు సహా తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Dr. Baidyanath Ghosh Dastidar, son of rebel TMC MP Kakoli Ghosh Dastidar, has sent a legal notice to former West Bengal Chief Minister Mamata Banerjee and several Trinamool Congress leaders including Mahua Moitra, Kalyan Banerjee, Sougata Roy, and Sonali Guha.
In the notice,… pic.twitter.com/HCYU0lQ0ZT— ANI (@ANI) June 14, 2026
ఐ-ప్యాక్ ప్రతినిధులే..
తాను ఎప్పుడూ బరాసత్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపలేదని బైద్యనాథ్ స్పష్టం చేశారు. అయితే టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐ-ప్యాక్ (I-PAC) ప్రతినిధులే తనను సంప్రదించి బరాసత్ నుంచి పోటీ చేయాలని కోరారని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక పార్టీ కార్యకర్తలు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొనాలని పలుమార్లు ఆహ్వానించినట్లు కూడా నోటీసులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పటికే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీల్లో ఒక వర్గం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. తమకు మద్దతుగా గణనీయ సంఖ్యలో ఎంపీలు ఉన్నారని తిరుగుబాటు వర్గం ప్రకటించగా, పార్టీ అధిష్ఠానం వారిని "ద్రోహులు"గా అభివర్ణించింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల పార్టీ సంస్థాగత నిర్మాణంలో పలు మార్పులు చేపట్టి తిరుగుబాటు నేతలను కీలక పదవుల నుంచి తప్పించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


