న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రులు వేసే బిల్లులకు భయపడి చాలా మంది వాటిల్లో చేరాలంటేనే దడుచుకుంటారు. కేవలం చికిత్సకు మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల బిల్లులు వేస్తుంటాయి ఆసుపత్రులు. ఓ వ్యక్తి తనకు ఆసుపత్రిలో ఎదురైన ఇటువంటి అనుభవం గురించి చెప్పాడు. ఇప్పటికే వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి ఆసుపత్రి ప్రాంగణంలోని రెస్టారెంట్‌లో తక్కువ తిన్నప్పటికీ రూ.700కు పైగా బిల్లు రావడంతో షాక్‌కు గురయ్యాడు.
సంతోష్ భారత్‌వంశీ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన గురించి వివరించాడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి ఓ కారణంతో వెళ్లినట్లు తెలిపాడు. ఆకలిగా అనిపించడంతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న ప్రముఖ ఆహార సంస్థ అవుట్‌లెట్‌లో అల్పాహారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే భోజనం ముగిసిన తర్వాత అతడికి రూ.708 బిల్లు వచ్చింది. తాను కేవలం 3 వస్తువులు మాత్రమే ఆర్డర్ చేయడంతో ఆ బిల్లు చూసి ఆశ్చర్యపోయాడు. అవి మసాలా దోశ, ఓ కప్పు టీ, మజ్జిగ. మసాలా దోశ ధర రూ.274, టీ ధర రూ.74, మజ్జిగ ధర రూ.85 అని తెలిపాడు.
“అల్పాహారం కోసం 2 మసాలా దోశలు, ఒక టీ, ఒక మజ్జిగ ఆర్డర్ చేశాం. బిల్లు రూ.708 వచ్చింది. అది చూసిన వెంటనే నా తల తిరిగిపోయింది. ఒక మసాలా దోశ ధర రూ.274. 200 మిల్లీలీటర్ల మజ్జిగ బాటిల్ ధర రూ.85. ఒక టీ ధర రూ.74.
ఆసుపత్రిలో అడుగుపెట్టిన క్షణం నుంచే రోగి మందులు, డాక్టర్ ఫీజులు, ఆసుపత్రి ఖర్చులతో రోగి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంటారు. దీనికి తోడు ఆహారం, పానీయాల విషయంలో ఇలా దోచుకోవడం.. రూ.74 టీ, రూ.20 విలువ చేసే మజ్జిగకు రూ.85 వసూలు చేయడం చాలా ఎక్కువైంది” అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ప్రముఖ ఆహార సంస్థ యజమానుల మానవత్వంపై అతడు ప్రశ్నలు లేవనెత్తాడు.
“వారి యజమానుల్లో కనీస మానవత్వం కూడా మిగల్లేదా? బయట ఎక్కడైనా ప్రజల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నా, కనీసం ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లో అయినా ఈ బహిరంగ దోపిడీని ఆపండి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బయట అల్పాహార ఆర్డర్లపై 30%-40% తగ్గింపు ఉంటుంది. కానీ ఆసుపత్రి లోపల ఎలాంటి ఆఫర్లు లేవు.. నేరుగా దోపిడీ మాత్రమే” అని పోస్టులో పేర్కొన్నాడు.
ఈ పోస్టు వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు. ఎక్కువ మంది ఈ వ్యక్తి సమస్య తమకు కూడా ఎదురైనట్లు తెలిపారు. ఈ పోస్టును ఎక్స్‌లో ‘ఎస్‌కేవై జర్నో’ అనే ఖాతాలో షేర్ చేశారు.
आज किसी कारणवश दिल्ली के अपोलो हॉस्पिटल में जाना पड़ा।
सुबह सुबह का समय था तो भूख लग रही थी
सोचा चलो कुछ खाते हैं
हॉस्पिटल के अंदर ही हल्दीराम का रेस्टोरेंट था
हमने खाने के लिए 2 मसाला डोसा, एक चाय है एक छाछ ऑर्डर किया।
बिल बन गया ₹708 रुपए का, माथा घूम गया बिल देखकर
👉… pic.twitter.com/mqESf2djmu— Santosh Bharatvanshi (@SKYjourno) August 1, 2026


