పుష్కరకాలంలో దేశ రక్షణకు
ఎంతో కృషి కొనియాడిన అమిత్ షా
దోవల్‌కు లోకమాన్య తిలక్ పురస్కారం ప్రదానం
పుణె: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భారత రక్షణ సామర్థ్యాన్ని గత పుష్కరకాలంలో సమున్నత స్థాయికి తీసుకెళ్లారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. శనివారం పుణెలో జరిగిన కార్యక్రమంలో అజిత్ దోవల్‌కు అమిత్ షా ‘లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్,2026’ను ప్రదానంచేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘‘రక్షణాత్మక వైఖరితోపాటు విరుచుకుపడే తత్వాన్ని దోవల్ సారథ్యంలో భారత సాయుధ బలగాలు అందిపుచ్చుకున్నాయి.
భారత విదేశాంగ విధానం బలపడటంలోనూ దోవల్ తనదైన పాత్ర పోషించారు. ప్రధాని మోదీ జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న ప్రతి తుది నిర్ణయంలోనూ దోవల్ కీలకమైన పాత్ర పోషించారు. 2008లో నేను గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో వరసబెట్టి బాంబుపేలుళ్లు జరిగాయి. నాడు సీఎం హోదాలో మోదీయే దోవల్‌కు ఈ పేలుళ్ల కారకులను కనిపెట్టాలని సూచించారు. ఈ ఘటనతోపాటు మొత్తం దేశవ్యాప్తంగా 13 బాంబుపేలుళ్ల ఘటనలను దోవల్ ఛేదించారు’’అని అమిత్ షా కొనియాడారు.
దేశసేవకు సిద్ధంగా ఉండాలి: దోవల్
ఈ సందర్భంగా దోవల్ మాట్లాడారు. ‘‘స్వేచ్ఛ అంటే మనం ఏదైనా చేయొచ్చని నేటి యువత భావిస్తోంది. అది సబబు కాదు. స్వీయ ప్రయోజనాల కోసమేకాదు యువత దేశ ప్రయోజనాలనూ పట్టించుకోవాలి. ఏరకంగానైనా దేశ సేవ చేసేందుకు యువతరం సంసిద్ధంకావాలి. దేశ చరిత్రలోనే నేడు భారత్ సమున్నతంగా ఎదిగే సువర్ణావకాశం వచ్చింది. దీనిని మనం చేజార్చుకోవద్దు. దేశం కోసం త్యాగాలు చేసేందుకు సిద్దపడాలి.
తిలక్ పుణెలో ప్లేగువ్యాధి ప్రబలి తన 21 ఏళ్ల కుమారుడిని కోల్పోయినా ఆయన ఈ నగరాన్ని వీడలేదు. నగరసేవకు ప్రాధాన్యతనిచ్చారు. యువత చిన్నపాటి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి దేశ సేవ కోసం ఆలోచించాలి. స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్ అనుకుని అక్కడితో ఆగిపోలేదు. అదే స్పృహ అందరిలో కలిగేలా స్ఫూర్తి కణికలు మండించారు’’అని దోవల్ వ్యాఖ్యానించారు.


