గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర న్యాయ శాఖ
పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు ఇక కఠిన శిక్షలు
న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీకి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే దోషులకు కఠిన శిక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్–యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2024 నాటి చట్టంలో సవరణ చేస్తూ ఈ బిల్లును రూపొందించింది.
శిక్షలు, జరిమానాలను భారీగా పెంచింది. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు చేయాలని సూచించగా, ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రపతి ఆమోదం తెలియజేయడంలో బిల్లు ఇక చట్టరూపం దాల్చినట్లే. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రశ్నపత్రం లీకేజీ కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
పరీక్షల్లో పేపర్ లీకేజీ లేదా అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం ఐదేళ్లు మరియు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాలను లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్లను తారుమారు చేయడం, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం, నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేయడం వంటి 15 చట్టవిరుద్ధమైన చర్యలను ఈ చట్టంలో చేర్చారు.
అలాగే కేసుల విచారణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టులు చార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలల లోపే విచారణను పూర్తి చేస్తాయి. ఈ ఏడాది నీట్–యూజీ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఆ బిల్లు త్వరగా పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


