‘లీకేజీ’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం  | Rajya Sabha Clears Anti-Paper Leak Bill-2026 | Sakshi
Sakshi News home page

‘లీకేజీ’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం 

Jul 31 2026 5:14 AM | Updated on Jul 31 2026 5:14 AM

Rajya Sabha Clears Anti-Paper Leak Bill-2026

వాకౌట్‌ చేసిన ప్రతిపక్షాలు.. మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర  

ఇప్పటికే లోక్‌సభలో బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: పేపర్‌ లీకేజీలను అరికట్టడానికి, దోషులకు కఠిన శిక్ష విధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’ రాజ్యసభలో ఆమోదం పొందింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర సహాయం మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్‌ చేయగా, మూజువాణి ఓటుతో బిల్లుపై ఆమోదముద్ర వేశారు. ఉభయ సభల ఆమోదం పొందడంతో బిల్లు ఇక రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. 

రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలను సహించే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తేల్చిచెప్పారు. నిజాయతీగా కష్టపడి చదివే విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు రాజ్యసభలో ప్రకటించారు. ఈ బిల్లు ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) చట్టం–2024కు కొనసాగింపు అని ఆయన చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి దేశంలోనే మొట్టమొదటిగా 2024లో చట్టం తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు.

 ప్రస్తుత సవరణ ఒక ముందడుగు అని అభివర్ణించారు. పరీక్షల వ్యవస్థలో మెరిట్, పారదర్శకత, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, యువత ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో, ఇటీవలి అనుభవాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సవరణలను తీసుకొచ్చినట్లు జితేంద్ర సింగ్‌ తెలియజేశారు. పరీక్షల్లో సంస్కరణలపై నిర్మాణాత్మక సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు.  

యువతను శాంతింపజేయడానికే బిల్లు: ఖర్గే  
నీట్‌ పేపర్‌ లీక్‌పై ఆందోళనకు దిగిన  విద్యార్థులపై పోలీసుల దమనకాండకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షానే బాధ్యుడని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజలు ఏదో ఒకరోజు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పేపర్‌ లీక్‌ నిరోధక బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పేపర్‌ లీక్‌పై వారిద్దరూ ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, విద్యార్థులను కొడుతున్న సాధారణ దుస్తుల్లోని వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పలేకపోతే, రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. 

ప్రశ్నపత్రాల లీకేజీని ఎలా అరికడతారో చెప్పకుండా కేవలం యువతను శాంతింపజేయడానికే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. అధిక జరిమానాలు, కఠినమైన శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల వంటి చర్యలు ఎలాంటి మార్పు తీసుకురావని తేల్చిచెప్పారు. పరీక్షలను నిర్వహించే సంస్థలు, పరీక్షల విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టకపోతే పేపర్‌ లీకేజీలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు యువతకు ఖర్గే అభినందనలు తెలియజేశారు. యువత పోరాటం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనల కారణంగానే ప్రభుత్వం చివరికి తలవంచిందని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement