న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్ పక్కన ఉన్న దర్గాలో ప్రార్థనలు జరుపుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం ముస్లింలకు అనుమతిచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల మధ్యలో ముస్లింలు దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇరు పక్షాల సమ్మతితో ఇంకోచోట ప్రార్థనలు జరుపుకునేందుకు ఉన్న అవకాశానికి తమ ఆదేశాలు అడ్డుకావని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
ఈ నెల 14న సుప్రీంకోర్టు భోజ్‌శాల కాంప్లెక్స్ పక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో ముస్లింలు శుక్రవారపు నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కేసు విచారణ పూర్తయ్యేంత వరకూ వర్తించే ఈ ఆదేశం అమలు కాలేదని ఆరోపిస్తూ ముస్లింల తరఫున హాజీ మునీర్ అహ్మద్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారులు భోజ్‌శాల కాంప్లెక్స్‌కు 1.3 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని ప్రత్యామ్నాయంగా చూపారని ఇది తమకు సమ్మతం కాదని పిటిషన్ ద్వారా వాదించారు. భోజ్‌శాల మసీదును చూడగలిగే అవకాశం ఉండాలని కోరారు.
ముస్లింల తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ, ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్‌లు తమ వాదనలు వినిపించగా జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ గురువారం తానిచ్చిన మునుపటి తీర్పును సవరించింది. ‘‘గత తీర్పులో దర్గా భూమిగా చెబుతున్న ఖస్రా నెం 596లోని ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి మూడు గంటల మధ్యలో ప్రార్థనలు మస్లిం సముదాయానికి అనుమతిచ్చాం. మాకందిన ప్లాన్ కాపీ ప్రకారం ఈ చోటికి వేరే రహదారి కూడా ఉంది. కాబట్టి ఈ స్థలం వారికి అనువుగా ఉంటుంది.’’అని స్పష్టం చేసింది.


