పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి, దిండి ప్రాజెక్టులకు సుప్రీం ఊరట
పాత అనుమతులకు రక్షణ.. కొత్త దరఖాస్తులపై ఇక నిషేధం
2021 నాటి ‘పోస్ట్ ఫ్యాక్టో’ఆఫీస్ మెమోరాండం రద్దు చేసిన సీజేఐ ధర్మాసనం
భారీ ప్రజాప్రయోజనాలుంటే నోటిఫికేషన్ ద్వారానే మినహాయింపులు
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ అనుమతుల (ఈసీ) విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు తెలంగాణ రాష్ట్రానికి భారీ ఊరటనిచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించిన భారీ ప్రాజెక్టులకు వెనుకటి తేదీతో (ఎక్స్–పోస్ట్ ఫ్యాక్టో) అనుమతులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం రద్దు చేసింది. అయితే గతంలో ఉన్న అనిశ్చితి, ప్రాజెక్టుల్లో ఇమిడి ఉన్న ప్రజాధనాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు భవిష్యత్తుకు మాత్రమే (ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్) వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో పాత అనుమతులకు రక్షణ లభించి, తెలంగాణలో నిలిచిపోయిన పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
రాష్ట్ర ప్రాజెక్టులకు తొలగిన అడ్డంకులు
గతంలో పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కుల వల్ల పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, దిండి ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ప్రాజెక్టులకు మార్గం సుగమమైంది. పాత అనుమతులు రద్దు కాకపోవడం, భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధమైన నోటిఫికేషన్ ద్వారా మినహాయింపులు పొందే అవకాశం ఉండటం రాష్ట్ర సాగునీటి రంగానికి వరంగా మారింది. వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.
భారీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ముందస్తుగా అనుమతులు తీసుకోవడం ప్రాథమిక నిబంధన అని తేల్చిచెప్పింది. ముందస్తు అనుమతులు లేని ప్రాజెక్టులను క్రమబద్ధికరించేందుకు కేంద్రం 2021లో జారీ చేసిన ఓఎం ఒక శాశ్వత మార్గాన్ని ఏర్పాటు చేసిందని ధర్మాసనం తప్పుబట్టింది. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, ఈఐఏ నోటిఫికేషన్–2006 నిబంధనలను పరిపాలనా ఉత్తర్వు ద్వారా తొలగించడం చట్టసమ్మతం కాదని చెప్పింది. ఏ ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వాలనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వచ్ఛమైన పర్యావరణం)ల ఉల్లంఘనే అని స్పష్టం చేసింది.
నోటిఫికేషన్ ద్వారానే మినహాయింపులు
ముందస్తు అనుమతి నిబంధన ప్రాథమికమైనప్పటికీ, అత్యంత అరుదైన, భారీ ప్రజాప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టుల విషయంలో చట్టంలోని సెక్షన్ 3 కింద పరిమిత కాలానికి ప్రత్యేక మినహాయింపు నోటిఫికేషన్లు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని ధర్మాసనం చెప్పింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా అత్యవసర ప్రాజెక్టులను క్రమబద్ధికరించడానికి చట్టబద్ధమైన నోటిఫికేషన్ తీసుకురావాలి తప్ప, దొడ్డిదారిన ఆఫీస్ మెమోల ద్వారా అనుమతులు మంజూరు చేయడం చెల్లదని చెప్పింది.
గత తీర్పులపై స్పష్టత
వివిధ కేసుల్లో గతంలో ఇచ్చిన తీర్పుల వర్తింపుపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కామన్ కాజ్ (2017), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (2020) కేసుల్లో ముందస్తు పర్యావరణ అనుమతి ఆవశ్యకతను సమరి్థంచిన విషయాన్ని గుర్తుచేసింది. పహ్వా ప్లాస్టిక్స్ (2022), డి.స్వామి (2022) కేసులు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇచ్చినవని, వాటిని సాధారణ సూత్రాలుగా పరిగణించలేమని తెలిపింది. పర్యావరణ చట్టాలు పోస్ట్ ఫ్యాక్టో అనుమతులకు వీలు కలి్పస్తాయంటూ ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ (2021) కేసులో చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పుడు వ్యాఖ్యానమంటూ వాటిని తప్పుబట్టింది. అయితే 2017లో ఇచ్చిన వన్–టైమ్ మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటును మాత్రం అంగీకరించింది.
కీలక ఆదేశాలివీ..
⇒ పాత అనుమతులకు రక్షణ: 2017 నోటిఫికేషన్ లేదా 2021 ఓఎం కింద ఇప్పటికే పొందిన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయి. వాటిపై చట్ట ప్రకారం విడిగా సవాళ్లు వస్తే తప్ప రద్దు కావు.
⇒ కొత్త దరఖాస్తులపై నిషేధం: ఈ విధానాల కింద ఇకపై ఎలాంటి కొత్త దరఖాస్తులను స్వీకరించరాదు. భవిష్యత్తులో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఎక్స్–పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వకూడదు.
⇒ పెండింగ్ దరఖాస్తుల పరిశీలన: పాత ఉత్తర్వుల వల్ల పెండింగ్‌లో ఉన్న లేదా తిరస్కరించిన దరఖాస్తులను తీర్పులోని పేరా 79లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అధికారులు పరిశీలించాలి.
⇒ ఆర్టికల్ 142 అధికారాలు: సంపూర్ణ న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న విశేషాధికారాలకు ఈ తీర్పు అడ్డంకి కాదు.
⇒ అప్పీళ్ల పరిష్కారం: మద్రాస్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన సివిల్ అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను తాజా తీర్పుకు అనుగుణంగా పరిష్కరించింది. ఒక షాపింగ్ మాల్ మూసివేతకు సంబంధించి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వచ్చిన అప్పీల్‌ను ప్రత్యేకంగా విడదీసి సంబంధిత బెంచ్ ముందుకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.


