ఇష్టారీతిగా ఉద్యోగం వదిలేస్తానంటే కుదరదు | Supreme Court Rules: No Leaving Indian Air Force Without Prior Approval | Sakshi
Sakshi News home page

ఇష్టారీతిగా ఉద్యోగం వదిలేస్తానంటే కుదరదు

Jul 30 2026 2:06 PM | Updated on Jul 30 2026 2:11 PM

No Leaving Indian Air Force Without Approval Supreme Court Rules

న్యూఢిల్లీ: అనుక్షణం సర్వసన్నద్ధంగా ఉండాల్సిన భారత వాయుసేనలో పనిచేసే ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగం మానేసి ఇతర సివిల్‌ పోస్టుల్లోకి చేరిపోతామంటే కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏడేళ్లపాటు భారతవాయుసేనలో కార్పోరల్‌గా ఉద్యోగం చేసిన నఖత్‌సింగ్‌ అనే వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాసి హిందీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరతానంటే ఒప్పుకునేది లేదు అని జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌ చందూర్కర్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. 

దేశభద్రత దృష్ట్యా వాయుసేనలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులు అనుక్షణం అందుబాటులో ఉండటం అత్యావశ్యకం. వేరే ఉద్యోగం, వృత్తిలో చేరాలనుకుంటే వాయుసేన నుంచి తొలి దశలోనే ముందస్తు అనుమతిపొందాలి. ఆర్‌పీఎస్‌సీకి 2020లో దరఖాస్తు చేసి, పరీక్ష రాసి, ఉద్యోగం పొందాక తీరిగ్గా నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ), డిశ్చార్జ్‌ ఆర్డర్‌ కావాలని వస్తే కుదరదు అని కోర్టు తేల్చిచెప్పింది. గతంలో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రిబ్యూనల్‌ తర్వాత ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యాక సుప్రీంకోర్టు తలుపుతట్టినా నఖత్‌ సింగ్‌కు నిరాశ ఎదురైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement