సాక్షి, న్యూఢిల్లీ: విచారణ పేరుతో వేరే దేశాల్లోలాగా ఫైవ్ స్టార్ హోటళ్లు కావాలా అని విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. సీఐ నాగరాజు పోలీసు కస్టడీకి హైకోర్టు విధించిన నిబంధనలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. కింది కోర్టులు విధించిన నిబంధనల వల్ల పోలీసు కస్టడీ లక్ష్యం నెరవేరడం లేదని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
నిందితుడిని విచారణకు రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తీసుకొచ్చేందుకు రానుపోను ఆరు గంటల సమయం పడుతోందని, విచారణకు సమయం ఎక్కడ ఉంటుందని అన్నారు. సీఐ నాగరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపిస్తూ.. విజయవాడ జైలులో ఉన్న పలువురి అరెస్టుకు ఆ పోలీస్ అధికారి కారణమైనందున, అక్కడ ఉంచితే ప్రాణహాని ఉంటుందనే ఉద్దేశంతోనే హైకోర్టు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చిందని తెలిపారు.
ఈ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. ‘విచారణ పేరుతో వేరే దేశాల్లో లాగా ఫైవ్ స్టార్ హోటళ్లు, ఏసీ రూమ్‌లు, ప్రత్యేక సదుపాయాలు కావాలా ఏంటి?’ అని నాగరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇక్కడ సమస్య కేవలం జైలు మార్పిడి గురించి కాదని, రిమాండ్ విచారణ పద్ధతి గురించి అని స్పష్టం చేసింది. పోలీస్ విచారణ చట్టబద్ధమైన పద్ధతుల్లో, కోర్టు మార్గదర్శకాలకు లోబడి మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. జూన్ 23న అరెస్ట్ జరిగినందున చట్టప్రకారం 90 రోజుల దర్యాప్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని తేల్చిచెబుతూ «తీర్పును రిజర్వ్ చేసింది.


