బనశంకరి: బెంగళూరులోని బొమ్మనహళ్లి నియోజకవర్గం కూడ్లు ప్రాంతంలో వాలిన రూ.200 కోట్ల విలువ చేసే భారీ భవంతిని తొలగించాలని గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) సూచించింది. 18 అంతస్తుల ఈ భారీ భవంతి బెంగళూరులోనే అతి ఎత్తయిన భవంతిగా పేరొందింది. అశాస్త్రీయంగా నిర్మించిన 49 ఫ్లాట్లు కలిగిన 18 అంతస్తుల భారీ భవంతి ఒక పక్కకు వాలిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
భవనానికి స్ట్రక్చరల్ డ్యామేజీ ఎదురుకాగా.. భవిష్యత్‌లో కూలిపోవచ్చనే భయం ఏర్పడింది. దీంతో కట్టడంలో వాలిన భాగాన్ని తొలగించాలని జీబీఏ సూచించింది. సంబంధిత యజమానితో జీబీఏ కమిషనర్ సమావేశం నిర్వహించి కట్టడం తొలగింపునకు సూచించారు. వాలిన కట్టడం తొలగించడానికి యజమాని సమ్మతించారు. కట్టడం తొలగింపునకు ముందు ప్రజల భద్రతకు సంబంధించి జీబీఏ అనుమతి తీసుకున్నారు. వ్యర్థాల తొలగింపు వ్యయం భరించడానికి సంస్థ ముందుకు వచ్చింది.


