హైదరాబాద్‌లో ఇల్లు.. ఇకపై ఇలాగే కట్టుకోవాలి! | Hyderabad New Building Rules CURE Act Green Buildings Construction Norms, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇల్లు.. ఇకపై ఇలాగే కట్టుకోవాలి!

Jul 18 2026 9:27 AM | Updated on Jul 19 2026 7:07 AM

Hyderabad New Building Rules CURE Act Green Buildings Construction Norms

సాక్షి, సిటీబ్యూరో: భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్‌ నగరంలో నిర్మాణాలకు ‘క్యూర్‌’ కొత్త  చట్టంలో కట్టుదిట్టమైన ప్రమాణాలను ప్రతిపాదించారు. గ్రీన్‌ బిల్డింగ్స్‌కు ప్రాధాన్యమిస్తూ తగిన ప్రోత్సాహకాలతో పాటు, పెద్ద భవనాల్లో వాతావరణ మార్పులను తట్టుకునే డిజైన్లు, వర్షపునీటి సంరక్షణ, నిర్మాణ సమయంలో దుమ్ము, శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు, అవసరాకనుగుణంగా ప్రభుత్వం సూచించే ఇతర పర్యావరణ చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది.

భారీ భవనాలు లేదా ప్రత్యేక కేటగిరీల ప్రాజెక్టులకు ట్రాఫిక్‌ ఇంపాక్ట్‌ స్టడీతోపాటు పర్యావరణ ప్రభావం అధ్యయనం చేయాలి. స్టామ్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌ప్లాన్‌ ఉండాలి. అంతేకాదు, గాలి ప్రభావం, భూకంప భద్రత వంటి సాంకేతిక నివేదికలను సైతం కోరే అధికారం ఉంటుంది. నెట్‌– జీరో, గ్రీన్‌ బిల్డింగ్స్‌ లేదా తక్కువ కర్బన ఉద్గారాల భవనాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి చట్టం అవకాశం కల్పించింది.

లోకల్‌ ఏరియా ప్లాన్‌ 
నగరంలో ఆయా ప్రాంతాలకు తగ్గట్లుగా లోకల్‌ ఏరియా ప్లాన్‌ను రూపొందించే అధికారం సంబంధిత కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఉంటుంది. నోటీసు జారీ చేసి ఒక ప్రాంతం లేదా వీధికి ప్రత్యేక లోకల్‌ ఏరియా ప్లాన్‌ రూపొందించవచ్చు. ఇందుకోసం నెలరోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి కార్పొరేషన్, అనంతరం ప్రభుత్వానికి సిఫారసులతో పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత గెజిట్‌లో ప్రచురించి అమలు చర్యలు చేపడతారు. తద్వారా ఒక ప్రాంతానికి తగిన నిర్మాణ శైలిని నిర్దేశించవచ్చు. ప్లాట్‌ కనీస పరిమాణాన్ని నిర్ణయించవచ్చు. నిర్దిష్ట విస్తీర్ణంలో నిర్మించే భవనాలు లేదా నివాస యూనిట్ల సంఖ్యను పరిమితం చేయవచ్చు. దుకాణాలు, గోదాములు, పరిశ్రమలు వంటి వినియోగాలపై నియంత్రణలు విధించవచ్చు.

వికలాంగులకు అనుకూల సౌకర్యాలు తప్పనిసరి 
దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం వారికి యాక్సెసిబిలిటీ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. భవన రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ మొత్తం అందుకు అనుగుణంగా ఉండాలి.

నిర్మాణ నాణ్యతపై కఠిన ప్రమాణాలు 
నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక నిబంధనలను కూడా ప్రభుత్వం సంబంధిత ముసాయిదా బిల్లులో పొందుపరిచింది. ప్రతి భవనం స్థల పరిస్థితులు, లేఅవుట్, రహదారి అనుసంధానం, నిర్మాణ భద్రత, ఎత్తు, విస్తీర్ణం, వెంటిలేషన్, పారిశుద్ధ్యం, నిర్మాణ సామగ్రి వంటి అంశాల్లో ప్రభుత్వం లేదా బై–లాస్‌ నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే కొన్ని ప్రత్యేక రకాల భవనాలకు అదనపు నిబంధనలు కూడా విధించే అధికారం కమిషనర్‌కు ఉంటుంది. మొత్తంగా.. కొత్త చట్టం ద్వారా గ్రేటర్‌ నగరంలో నియంత్రిత, పర్యావరణ హిత, భద్రతతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండే మౌలిక వసతులతో కూడిన భవన నిర్మాణాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement