గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా | Parliament sessions to begin soon Om Birla's invitation | Sakshi
Sakshi News home page

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

Jul 20 2026 9:46 AM | Updated on Jul 20 2026 12:17 PM

Parliament sessions to begin soon Om Birla's invitation

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. విపక్ష ఎంపీలు సభలో భారీగా నినాదాలు చేస్తూ రగడ సృష్టించడంతో, స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాగా వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ, మూడేళ్ల పాటు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌) నిర్వహణలో జరిగిన అక్రమాలు, విద్యార్థుల నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారీతనంపై అత్యవసరంగా చర్చించాలని కోరుతూ సిపిఐ రాజ్యసభ ఎంపీ పి. సంతోష్ కుమార్ రాజ్యసభలో రూల్ 267 కింద ‘సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్’ (కార్యకలాపాల నిలిపివేత) నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. 
 

ఈ సమావేశాలు ప్రారంభానికి ముందు లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. పార్లమెంట్ సభ్యులకు (ఎంపీలకు) పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ గౌరవాన్ని, పార్లమెంటరీ సాంప్రదాయాలను, సభామర్యాదలను కాపాడుతూ సభ్యులందరూ సహకార స్ఫూర్తితో సభ నడపటంలో సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ, ఇతర పార్లమెంటరీ కార్యకలాపాలను సవ్యంగా పూర్తి చేయడం సభ్యులందరి ఉమ్మడి బాధ్యత అని స్పీకర్ తెలిపారు. ఇది ప్రజల్లో పార్లమెంట్‌పై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని కూడా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. 

సార్థకమైన  చర్చలు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తీసుకునే నిర్ణయాలు,  పార్లమెంట్ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా ఈ సమావేశాలు సాగేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. ‘నేటి నుంచి 18వ లోక్‌సభ ఎనిమిదవ సమావేశం.. వర్షాకాల సమావేశం ప్రారంభమవుతోంది. దేవుడైన ఇంద్రుడి ఆశీస్సులతో ఈ రోజు ఉదయం ఢిల్లీలో కురిసిన వర్షం వాతావరణాన్ని నూతన శక్తితో, తాజాదనంతో నింపింది. ఇదే మంగళకరమైన వాతావరణంలో పార్లమెంట్ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థగా గౌరవనీయులైన సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉంది’అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement