జనగణన, నియోజకవర్గాల పునర్విభజన వరకు ఆగొద్దని సుప్రీంలో పిటిషన్
కేంద్రానికి నోటీస్ జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా ఈ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్న వాదనలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవ ల ఈ మేరకు విచారణ చేపట్టింది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా 2001 లేదా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చట్టం–2002 కింద మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని (రాజ్యాంగ 128వ సవరణ చట్టం–2023) అమల్లోకి తెచ్చేలా కేంద్రానికి మార్గనిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది యోగమాయ ఎం.జి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
అలా ముడిపెడితే ఫలితం సున్న
చట్టం ఆమోదం పొందినా 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల సేకరణ, తదనంతర డీలిమిటేషన్ ప్రక్రియతో దీని అమలును ముడిపెట్టడం వల్ల చట్టం నిరుపయోగంగా మారిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో లోక్‌సభ సీట్ల పెంపు, దేశవ్యాప్త డీలిమిటేషన్‌కు ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026 వీగిపోయిన నేపథ్యంలో ఈ పిల్ ప్రాధాన్యం సంతరించుకుంది.


