న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తొలిసారిగా ప్రజలకు ఒక సందేశాన్ని విడుదల చేశారు. జూలై 20న జరగనున్న ‘చలో పార్లమెంట్’ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఆయన ‘భారతదేశపు రెండో స్వాతంత్ర్య పోరాటం’గా అభివర్ణించారు. అన్యాయం, భయం, పేపర్ లీకులు, అక్రమ నిర్బంధం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసనను విజయవంతం చేసి, న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు.
ఆదివారం (జూలై 19) ఉదయం 8:30 గంటలకు అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని విఎంఎంసి, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సోనమ్ వాంగ్‌చుక్‌కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన నాడి, రక్తపోటు,ఇతర కీలక ఆరోగ్య సూచికలు సాధారణంగా ఉన్నాయి. అయితే, సుదీర్ఘకాలం పాటు నిరాహార దీక్ష చేయడంతో ఆయన రక్త పరీక్షల నివేదికలలో కొన్ని మార్పులు కనిపించాయి. ఆయన శరీరంపై ఉపవాస ప్రభావం తీవ్రంగా ఉందని, అందుకే నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్య
మరోవైపు, సోనమ్ వాంగ్‌చుక్ భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. తన భర్తను ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారని, అక్కడ అందుతున్న చికిత్సపై తమకు నమ్మకం లేదని ఆమె ఆరోపించారు. అనేకసార్లు అభ్యర్థించినా, ఆసుపత్రి యాజమాన్యం ఆయనను డిశ్చార్జ్ చేయడం లేదని లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించడం లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.


