సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ చెందిన రెబల్ ఎంపీల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలతో ఏర్పడిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)కి సమావేశానికి ఆహ్వానం ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్ష పార్టీలు సమావేశం నుంచి ప్రతీకాత్మకంగా వాక్ అవుట్ చేశాయి. కొద్దిసేపటి తర్వాత మళ్లీ సమావేశానికి హాజరయ్యాయి.
#WATCH | Delhi: On rebel TMC MPs, TMC MP Mahua Moitra says, "On what grounds they were invited by the Parliamentary Affairs Minister to attend the all-party meeting. The strength of Trinamool Congress is still showing us 28." pic.twitter.com/pWQxrTv8Q8
— ANI (@ANI) July 19, 2026
విపక్షాల అభ్యంతరం ఇదే..
టీఎంసీకి చెందిన సుమారు 20 మంది తిరుగుబాటు ఎంపీలు జూన్‌లో ఎన్‌సీపీఐలో విలీనం అయినట్లు ప్రకటించారు. అయితే ఆ విలీనాన్ని లోక్‌సభ స్పీకర్ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. అయినప్పటికీ ఎన్‌సీపీఐని అఖిలపక్ష సమావేశానికి పిలవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ వెబ్‌సైట్‌లో కూడా పేరు లేని, అధికారిక గుర్తింపు లేని పార్టీని ఎలా సమావేశానికి పిలుస్తారు? అని ప్రశ్నించారు.
మరోవైపు.. ఎన్‌సీపీఐ పార్లమెంటరీ పక్ష నాయకురాలు కాకోలి ఘోష్ దస్తిదార్ మాత్రం తమకు సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్‌కు అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తామని, విలీనానికి సంబంధించిన నిర్ణయం రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు పలు కీలక అంశాలను ప్రస్తావించాయి. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారం, నీట్ పేపర్ లీక్, వ్యవసాయ సమస్యలు, పెట్రోల్‌లో ఈ20 ఇంధన మిశ్రమం, అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) వంటి అంశాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశాయి. దీంతో, వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే అఖిలపక్ష సమావేశంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్‌సీపీఐకి ఇచ్చిన గుర్తింపుపై మొదలైన వివాదం.. పార్లమెంట్ సమావేశాల్లోనూ అధికార–విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి.


