ఇమ్రాన్ ఖాన్ సోదరి వివాదాస్పద వ్యాఖ్యలు | Imran Khans Sister Alleges India Pakistan 2025 Conflict Was Linked To Israel Recognition Plans, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ ఖాన్ సోదరి వివాదాస్పద వ్యాఖ్యలు

Jul 19 2026 1:26 PM | Updated on Jul 19 2026 4:57 PM

Imran Khans sister alleges India Pakistan 2025 conflict was linked to Israel recognition plans

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నూరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. 2025 మే నెలలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాటి సైనిక ఘర్షణను భారత్ తీవ్రతరం చేయలేదని.. దానికి అసలు కారణం పాకిస్థాన్ అంతర్గత నిర్ణయాలేనని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం ‘ఇజ్రాయెల్’ దేశాన్ని గుర్తించే దిశగా అడుగులు వేయడం వల్లే ఆ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఆమె అన్నారు.

ఈ వివాదం పాకిస్థాన్ సైనిక అధిపతి జనరల్ అసిమ్ మునీర్, ‘అబ్రహం ఒప్పందాల’ చుట్టూ తిరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ ఘర్షణ పాకిస్థాన్ సైనిక నాయకత్వం  ప్రతిష్టను పెంచడానికి చేసిన ప్రయత్నమని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, ఈ ఆపరేషన్ ‘పాకిస్థాన్ సైనిక నాయకత్వం- భారత ప్రధాని నరేంద్ర మోదీల కుమ్మక్కు ఫలితమే’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్ ఇజ్రాయెల్‌ను గుర్తించబోతోంది కాబట్టే, ఇజ్రాయెల్ సూచన మేరకు భారత్ ఘర్షణను తీవ్రతరం చేయకుండా వెనక్కి తగ్గింది’ అని ఆమె పేర్కొన్నారు.

పాకిస్థాన్ ప్రభుత్వం స్పందన
పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ నాయకురాలు, సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మా బొఖారీ, నియాజీపై మండిపడుతూ, ఆమె జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడారని అన్నారు. ‘నూరీన్ నియాజీ వ్యాఖ్యలు ఆమె సోదరుడు ఇమ్రాన్ ఖాన్ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఖాన్ కుటుంబం పాకిస్థాన్ సాధించిన విజయాలను చూసి ఎప్పుడూ అసహనంతోనే ఉంటుంది. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత విచారకరం’ అని బొఖారీ అన్నారు.

నియాజీ ఇంకా ఏమన్నారంటే..
నియాజీ తన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపలేదు. ఈ ఘర్షణ ‘జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాకిస్థాన్ సాయుధ బలగాల ప్రతిష్టను పెంచడానికి పన్నిన కుట్ర’ అని ఆమె పేర్కొన్నారు. ‘ఏమనుకుంటున్నారు? మే 10న పాకిస్థాన్ దాడి చేసినప్పుడు, పెద్ద దేశమైన భారత్ స్పందించే స్థితిలో లేదా? భారత్ అనుకుంటే కచ్చితంగా బదులిచ్చేది, కానీ ఏదో ఒక అవగాహన వల్ల భారత్ కావాలనే బలమైన ప్రతిస్పందన ఇవ్వకుండా వెనక్కి తగ్గింది’ అని ఆమె అన్నారు.

ట్రంప్ ఏమన్నారు?
అమెరికా-ఇరాన్ మధ్య ఏదైనా శాంతి ఒప్పందం కుదిరే ముందు, పాకిస్థాన్‌తో సహా గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే నెలలో వ్యాఖ్యానించారు. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, మధ్యవర్తిగా దాని పాత్రపై చర్చ మొదలైంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రమే ట్రంప్ ప్రతిపాదనను బలంగా తిరస్కరిస్తూ, రెండు దేశాల సిద్ధాంతాలు పూర్తిగా భిన్నమైనవని, కాబట్టి పాకిస్థాన్ ఎప్పటికీ అబ్రహం ఒప్పందాల్లో చేరదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement