జమ్ములో వరదల విధ్వంసం..11 మంది మృతి | Jammu And Kashmir Heavy Rains, 11 Dead After Flash Floods And Landslides In Poonch And Kishtwar, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

జమ్ములో వరదల విధ్వంసం..11 మంది మృతి

Jul 19 2026 3:31 PM | Updated on Jul 19 2026 3:43 PM

11 dead in massive floods in Jammu and Kashmir

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో నిన్న( శనివారం) రాత్రి కురిసిన వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి.  పూంచ్, కిష్త్వార్‌లలో  భారీ వర్షాల ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పూంచ్‌లోని సురాన్‌కోట్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒక ఇల్లు పూర్తిగా కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయింది. దీంతో వెంటనే డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎనిమిది మంది ఉండగా ఇప్పటి వరకూ రెండేళ్ల చిన్నారితో సహా ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

కిష్త్వార్‌లోని సుర్ను ప్రాంతంలో కురిసిన మేఘ విస్ఫోటనం వల్ల ఇళ్లు, వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. రాజౌరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్హల్ నది కూడా పొంగిపొర్లింది. సుమారు 200 నుంచి 250 వాహనాలు కొట్టుకుపోయాయి.కొండవాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాజౌరిలోని కొత్త బస్టాండ్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. 

ముఖ్యంగా దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి నీరు భారీగా చేరింది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని మురికివాడలో వరద నీరు చేరడంతో 50కి పైగా కుటుంబాలు నివాసాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. తారిక్ బ్రిడ్జ్ సమీపంలో నివసించే వారిని కూడా పోలీసులు అప్రమత్తం చేసి ఖాళీ చేయించారు.

శనివారం ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గుర్రపు, కంచర గాడిదల సేవలను నిలిపివేశారు, దీంతో కైలాష్-మానసరోవర్ యాత్రికుల బృందం కూడా చిక్కుకుపోయింది.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జూలై 23 వరకు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ఎమ్మెల్యే ఇఫ్తికార్ అహ్మద్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement