మంచు శివలింగం తొలి దర్శనం | First Glimpse of Baba Barfani Revealed Ahead of Amarnath Yatra 2026 | Sakshi
Sakshi News home page

మంచు శివలింగం తొలి దర్శనం

May 24 2026 8:37 AM | Updated on May 24 2026 8:37 AM

First Glimpse of Baba Barfani Revealed Ahead of Amarnath Yatra 2026

అనంతనాగ్‌: అమర్‌నాథ్‌ యాత్రకు సమయం ఆసన్నమవుతోంది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర గుహలో కొలువైన బాబా బర్ఫానీ (శివలింగం) తొలి దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శివభక్తులలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్ర జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనుంది. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. యాత్ర విజయవంతానికి జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక 'ప్రథమ పూజ' నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.

కట్టుదిట్టమైన భద్రతా వలయం
యాత్ర నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను భారీగా పెంచారు. ముఖ్యంగా అనంతనాగ్ జిల్లాలో పహారా ముమ్మరం చేశారు. కశ్మీర్ జోన్ ఐజీపీ, డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నిరంతర నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు భద్రతా దళాలను ఆదేశించారు.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
యాత్రకు వచ్చే భక్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 30 నాటికి అందరికీ తప్పనిసరిగా ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు. బేస్ క్యాంపుల వద్ద నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా టెలికాం సంస్థలకు కీలక సూచనలు చేశారు. యాత్ర మార్గంలో పోనీ స్టాండ్ల నిర్మాణం, ఫెన్సింగ్, షెడ్ల వంటి మౌలిక సదుపాయాలన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement