జమ్ముకశ్మీర్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం తన కుమారుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం గుర్తుతెలియని మృతదేహం లభించిందని ఫోన్ రావడంతో ఆ కుటుంబం దానిని గుర్తించడానికి వెళ్లింది. అదే తమ వాని మృతదేహామే అని గుర్తించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా సడెన్‌గా ఫోన్ వచ్చింది. మీ కుమారుడు బ్రతికే ఉన్నాడని తన మిత్రుడు ఫోన్ చేయడంతో అంతా కంగుతిన్నారు.
వివరాల్లోకి వెళితే
సోహంజన నివాసి, ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 24 ఏళ్ల విశాల్ కుమార్, శనివారం డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అతని ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గుర్తుతెలియని మృతదేహం ఉందని ఫోన్ కాల్ రావడంతో ఆ కుటుంబం కంగారు పడి అక్కడికి వెళ్లింది.
కడుపుపై మచ్చ, ఒక కంటికి అయిన గాయం విశాల్ ముఖ లక్షణాలను పోలి ఉండటంతో, అది అతనేనని బంధువులు భావించారు. తమ కుమారుడు చనిపోయాడని నిశ్చయించుకున్న వారు, దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు.అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే వారికి అనుకోని ఫోన్ కాల్ వచ్చింది. విశాల్ బతికే ఉన్నాడని, బారి బ్రాహ్మణ నుండి ఇంటికి వస్తున్నాడని అతని స్నేహితుడు తెలిపాడు.
దీంతో వారి కుటుంబసభ్యులు షాక్‌గురయ్యారు. కొద్ది క్షణాల తర్వాత, విశాల్ క్షేమంగా ఇంటికి తిరిగి రాగానే సంతోషంతో ఉబ్బితబ్బయిపోయారు. తమ కుమారుడు బతికే ఉన్నాడని తెలుసుకున్న ఆ కుటుంబ సభ్యులు, గుర్తుతెలియని ఆ మృతదేహాన్ని జీఎంసీ ఆసుపత్రికి తిరిగి అప్పగించారు.


