యువతలో వేగంగా శారీరక వృద్ధాప్య ప్రక్రియ
కణ విభజనను నియంత్రించే ఓ క్రోమోజోమ్ భాగాల తగ్గుదలతో త్వరగా ముసలితనం
1965 తర్వాత పుట్టిన తరాల వారిలో 23% అధికంగా అవయవాల వృద్ధాప్య వేగం
వాయు కాలుష్యం, దురలవాట్లు, పట్టణీకరణే ప్రధాన కారణం
దీని ఫలితంగా చిన్న వయసు వారిలో పెరుగుతున్న గుండెపోట్లు, కేన్సర్లు
ఆరోగ్యకర జీవనశైలి అనుసరించాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, స్పెషల్ డెస్క్: భారత్‌లోని యువతలో శారీరక వృద్ధాప్య ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని శాస్త్రీయ పరిశోధనల ద్వారా వెల్లడైంది. పుట్టిన తేదీ ప్రకారం లెక్కించే వయసు కంటే శరీరంలోని కణాలు, అవయవాల ఆరోగ్యాన్నిబట్టి లెక్కించే బయోలాజికల్ వయసు నేటి యువతలో చాలా ఎక్కువగా ఉంటోందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం శరీరంలోని కణాల విభజనను నియంత్రించే టెలోమియర్స్ అనే క్రోమోజోమ్ భాగాలు చిన్న వయసులోనే తగ్గిపోవడం వల్ల అవి త్వరగా ముసలివి అవుతున్నాయి. కాలుష్యం, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్ వంటి దురలవాట్ల వల్ల శరీరంలో అంతర్గతంగా ఏర్పడే దీర్ఘకాలిక వాపు వృద్ధాప్య వేగాన్ని పెంచుతోంది. యువతలో ఈ వేగవంతమైన వృద్ధాప్యం వల్ల మునుపెన్నడూ లేనివిధంగా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారికే సైలెంట్ హార్ట్ ఎటాక్స్, పక్షవాతం, జీర్ణాశయ, పేగు, రొమ్ము కేన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా 25–30 ఏళ్ల వయసు వారిలో ఊబకాయం, టైప్–2 మధుమేహం, ఫ్యాటీ లివర్ సమస్యలు, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత, వెన్నునొప్పి వంటివి వెలుగు చూస్తున్నాయని వివరించింది. 50 ఏళ్లలోపు వారిలో ముందుగానే వృద్ధాప్య ఛాయల వల్ల ఊపిరితిత్తులు, జీర్ణాశయ, పేగు కేన్సర్ల ప్రమాదం 8% నుంచి 15% వరకు పెరుగుతోందని ఈ అధ్యయనం తేల్చింది.
అధ్యయనం సాగిందిలా..
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా యువతలో వయసు కంటే ముందే శారీరక వృద్ధాప్యం వేగంగా పెరుగుతోందని నిరూపించడానికి వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు సుమారు 1.5 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు ఫెనో ఏజ్ అనే ప్రత్యేక అల్గారిథమ్ ఆధారంగా రక్తంలోని 9 కీలక బయోమార్కర్లను (రక్తంలో చక్కెర, వాపు లేదా ఇన్‌ఫ్లమేషన్, రోగనిరోధక శక్తి వంటివి) పరీక్షించి బయోలాజికల్ వయసును లెక్కించారు. దీని ప్రకారం గత తరాల వారితో పోలిస్తే 1965 తర్వాత జన్మించిన యువ తరాలలో అంతర్గత అవయవాల వృద్ధాప్య వేగం 23% పెరిగింది.
భారత్‌లో ప్రాథమిక ఫలితాలు ఇలా..
భారతీయుల జన్యువులు, వాతావరణానికి తగినట్లుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఈ ఏడాది మేలో బయోమార్కర్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్, రిసీలియన్స్, అడ్వర్‌సిటీ అండ్ ట్రాన్సిషన్ పేరిట అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల యువత, పెద్దల నుంచి రక్త నమూనాలు, లాలాజలం, జుట్టు నమూనాలను సేకరించి వారి జీవక్రియలు, అంతర్గత వృద్ధాప్య వేగాన్ని లెక్కిస్తున్నారు. భారత్‌లో వేగవంతమైన పట్టణీకరణ, వాయు కాలుష్యం, పోషకాహార లోపాల వల్ల భారతీయుల్లో వయసు సంబంధిత లోపాలు మునుపటి కంటే చాలా త్వరగా పేరుకుపోతున్నాయని ప్రాథమిక డేటా సూచిస్తోంది. మరోవైపు ఈ ఏడాది జూన్‌లో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సెల్ అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వృద్ధాప్యం కొన్ని ప్రత్యేక వయసుల్లో అకస్మాత్తుగా వేగం పుంజుకుంటోంది. ముఖ్యంగా శరీరంలోని రక్తనాళాలు వృద్ధాప్య ప్రక్రియకు అత్యంత త్వరగా గురవుతున్నాయని వివరించింది.
వైద్య నిపుణుల సూచనలివీ..
– యువతలో శారీరక వృద్ధాప్య ప్రక్రియను నివారించేందుకు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహారంతోపాటు వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడిలేని జీవనాన్ని గడపడం ద్వారా ప్రమాదకర వ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
– విటమిన్–సీ, విటమిన్–ఈ ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, నట్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి కణాల నష్టాన్ని ఆపుతాయి
– ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, పంచదార వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి.
– రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలపాటు వాకింగ్, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయాలి. దీనివల్ల కణాలు పునరుజ్జీవనం పొందుతాయి.
– రోజూ తప్పనిసరిగా కనీసం 7–8 గంటలపాటు నిద్రపోవాలి.
– ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
– 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏటా కనీసం బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి.


