హైదరాబాద్: ప్రముఖ సినీ తారలంతా గ్రేటర్‌లోనే ఓటుకు మొగ్గు చూపారు. వీరిలో అధిక శాతం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధి జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నారు. ‘సర్’లో 98 శాతం మంది ఓటు హక్కు కొనసాగించేందుకు ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేసి బీఎల్‌వోలకు అందజేశారు.
ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్, అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, దర్శకుడు కె.రాఘవేందర్‌రావు, నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, రాణా, అభిరామ్‌తో పాటు పలువురు దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు ఉన్నారు. ఈ నెల 17న విడుదలయ్యే డ్రాఫ్ట్ జాబితాలో వీరందరి పేర్లు రానున్నాయి. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు మాత్రం నగరంలో ఓటుకు మొగ్గుచూపలేదు.
విజయ్ దేవరకొండ భార్య, హీరోయిన్ రష్మిక తన సర్ ఫారాన్ని ముంబైలో ఇచ్చినట్లు అధికారులకు వెల్లడించారు. ఖైరతాబాద్‌లో సినీ సెలబ్రిటీలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఎస్‌ఎస్ తాజా, మాజీ అధికారులు 448 మంది ఉన్నారు. 22 మంది ఐఏఎస్‌లు, 18 మంది తాజా, మాజీ ఐపీఎస్ లు, 31 మంది ఐఎస్‌ఎస్, ఐఆర్‌ఎస్‌లు తమ ఓటును సొంత రాష్ట్రాలకు మార్చుకున్నారు.


