ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారి గురించి అందరికీ తెలుసు. ఆఫ్రికా ఖండంలో దాదాపు మూడో వంతు ఆక్రమించి ఉన్న ఈ ఎడారి అపారమైన విశాలత్వానికి, నిర్జన ప్రదేశాలకు మారుపేరు. ఎటు చూచినా మైళ్ల కొద్దీ ఇసుక దిబ్బలు, ఏ మనుషులూ, చెట్లు కనిపించని ఈ భయంకరమైన వాతావరణంలో వేసవిలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి.
అయితే, చూడటానికి కేవలం ఇసుక మేటల వలె కనిపించే ఈ సహారా ఎడారి కింద మానవ చరిత్రను మార్చేయగల ఎన్నో అద్భుతమైన రహస్యాలు, విస్మయకరమైన నిజాలు ఇసుక అడుగున దాగున్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ శకానికి చెందిన విమాన అవశేషాలు:
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నార్త్ ఆఫ్రికా క్యాంపెయిన్‌లో భాగంగా సహారా ఎడారి ప్రాంతం ఒక ప్రధాన వైమానిక యుద్ధ రణరంగంగా మారింది. ఈ పోరులో వేలాది యుద్ధ విమానాలు కూలిపోయాయి. వాటిలో చాలా వరకు ఎడారిలో అదృశ్యమయ్యాయి. ఉదాహరణకు, 1943లో కూలిపోయిన అమెరికన్ 'లేడీ బి గుడ్' (Lady Be Good) బాంబర్ విమానం, దాదాపు 15 ఏళ్ల తర్వాత 1958లో ఎడారి మధ్యలో యాదృచ్ఛికంగా బయటపడింది.
అలాగే, 70 సంవత్సరాల తర్వాత 2012లో బయటపడిన బ్రిటిష్ ఫైటర్ పైలట్ డెన్నిస్ కాప్పింగ్ (Dennis Coppings) పీ-40 కిట్టిహాక్ విమానం ఇందుకు నిదర్శనం. ఇసుకలో కూరుకుపోయినా చెక్కుచెదరకుండా ఉన్న ఈ విమానాలు, ఆనాటి భయంకరమైన యుద్ధ పరిస్థితులకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
తిమింగలాల శ్మశాన వాటిక (Valley of the Whales):
ఈజిప్ట్‌లోని కైరోకు నైరుతి దిశలో ఉన్న 'వాడి అల్-హిటాన్' (Valley of the Whales) ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విస్మయకరమైన ప్రదేశం. సముద్రానికి వందల మైళ్ల దూరంలో, ఎడారి మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో వేలాది తిమింగలాల శిలాజాలు (Fossils) బయటపడ్డాయి.
ఇంచుమించు 4 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ 'టెథిస్ సముద్రం' ఉండేదని, ఆ కాలంలో ఇవి జీవించాయని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ లభించిన బాసిలోసారస్ (Basilosaurus) శిలాజాలకు చిన్నపాటి వెనుక కాళ్లు ఉండటం, తిమింగలాలు భూమిపై నుంచి సముద్రంలోకి ఎలా పరిణామం చెందాయనేదానికి తిరుగులేని శాస్త్రీయ ఆధారాలను అందించింది.
గరామాంటెస్ సామ్రాజ్యం - అద్భుతమైన నీటి నెట్‌వర్క్:
దక్షిణ లీబియాలోని ఎడారి మధ్యలో ఎవరికీ అంతుచిక్కని మరో రహస్యం ఉంది. 2011లో శాస్త్రవేత్తలు శాటిలైట్ చిత్రాల ద్వారా 'గరామాంటెస్' (Garamantes) అనే శక్తివంతమైన ప్రాచీన ఆఫ్రికా సామ్రాజ్య అవశేషాలను కనుగొన్నారు. వర్షపాతమే లేని ఈ కఠినమైన ఎడారిలో వీరు వేలాది మంది జనాభాతో పట్టణాలు, కోటలు నిర్మించారు. భూగర్భం గుండా కిలోమీటర్ల కొద్దీ 'ఫోగారాస్' (Fogaras) అనే నీటి కాలువలను తవ్వి, అడవులను తలపించేలా వ్యవసాయం చేసిన వీరు గొప్ప ఇంజనీర్లుగా నిరూపించుకున్నారు.
గ్రీన్ సహారా 'గెబరో' (Goberro) శ్మశాన వాటిక:
సహారా ఎడారి ఎప్పుడూ ఇలాగే లేదు. భూమి భ్రమణంలో జరిగే మార్పుల (Precession) కారణంగా ప్రతి 21 వేల సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలో రుతుపవనాలు మారి, వర్షాలు కురిసి పచ్చని అడవులుగా మారుతుంది. చివరిసారిగా 14,000 నుంచి 5,500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవులు, నదులతో కళకళలాడింది.
నైగర్ దేశంలోని 'గెబరో' (Goberro) ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 9,500 ఏళ్ల కిందటి మానవ సమాధులు బయటపడ్డాయి. చేపలు, మొసళ్లు, జిరాఫీలు జీవించిన ఆ కాలంలో.. మానవులు ఇక్కడ సంతోషంగా జీవించి, ఆ తర్వాత ఎడారిగా మారుతున్నప్పుడు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు.
తామ్రసెట్ (Tamanrasset) మహా నది:
గ్రీన్ సహారా కాలంలో ఈ ఎడారి గుండా 'తామ్రసెట్' అనే అతిపెద్ద నది ప్రవహించేదని శాస్త్రవేత్తలు 2015లో కనుగొన్నారు. ఆఫ్రికాలోనే రెండవ అతిపెద్ద నదిగా నిలిచే ఈ నది జాడలు మైక్రోవేవ్ రాడార్ శాటిలైట్ల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ నది ఒడ్డున కూడా ప్రాచీన నాగరికతలు వర్ధిల్లి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.
మొత్తానికి, పైన ఎడారి రూపంలో నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ సహారా ఇసుక దిబ్బల కింద మానవ చరిత్రకు సంబంధించిన ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు భవిష్యత్ తరాల కోసం ఇంకా దాగున్నాయి!.
(చదవండి: ఐదు పదుల వయసులోనూ అంతే యంగ్‌గా ప్రిన్స్ మహేశ్..! ఆకర్షణీయమైన రూపం కోసం..)


