అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే! | True Sanyasa Is Not In Saffron But In Self Realization | Sakshi
Sakshi News home page

అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!

Aug 11 2026 8:02 AM | Updated on Aug 11 2026 8:04 AM

True Sanyasa Is Not In Saffron But In Self Realization

భక్తి, ఆధ్యాత్మికత

'జటిలో ముణ్డీలుంచిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః
ఉదర నిమిత్తం బహుకృత వేషః'
ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).

శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.

కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.

ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).
– రాచమడుగు శ్రీనివాసులు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement