స్టెమ్‌సెల్స్‌ మిరాకిల్స్‌.. ఇకపై బట్టతల ఉండకపోవచ్చు! | Stem Cell Therapy New Hope For Cancer Diabetes Vitiligo Hair Loss | Sakshi
Sakshi News home page

స్టెమ్‌సెల్స్‌ మిరాకిల్స్‌.. ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!

Aug 11 2026 7:45 AM | Updated on Aug 11 2026 7:46 AM

Stem Cell Therapy New Hope For Cancer Diabetes Vitiligo Hair Loss

హెల్త్‌

ఒక కొత్తజీవి పుడుతున్నప్పుడు ఏర్పడే మొదటి కణంలాగే మూలకణాలూ తొలుత ఒకటిలాగే కనిపిస్తాయి. కానీ అవి భవిష్యత్తులో ఏర్పడబోయే దేహ భాగాలను బట్టి, దేహంలోని వ్యవస్థలను బట్టి వివిధ రకాల కణాలుగా రూపుదిద్దుకుంటాయి. ఆ కణాలు మరింత విభజన చెందాక టిష్యూస్‌గా ఏర్పడతాయి. అలా చర్మం, రక్తకణాలు, కడుపులోని లోపలి పొరల తాలూకు కణాలు, కాలేయం, మెదడు, వెంట్రుకలు వంటి రకరకాల శరీర భాగాలు ఏర్పడతాయి. మౌలికంగా అవన్నీ కణాలే అయినా అవి చేసే పనిని బట్టి కొద్ది వైవిధ్యంతో ఉంటాయి. అయితే ఇలాంటి వేర్వేరు కణాల్లో ఏ భాగానికి చెందిన లేదా ఏ వ్యవస్థకు చెందిన కణంగానైనా రూపొందే శక్తి ఒక్క మూలకణాలకు మాత్రమే ఉంటుంది.

అలా మారగలిగే మౌలిక కణాన్నే మూలకణం (ఇంగ్లిష్‌లో స్టెమ్‌సెల్‌) అంటారు. ఈ స్టెమ్‌సెల్స్‌ సహాయంతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాధులకు చికిత్సలూ జరుగుతున్నాయి. స్టెమ్‌సెల్స్‌పై అవగాహనతో పాటు వేర్వేరు కణాలుగా రూపొందడం ద్వారా అవి ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.

మూలకణం అంటేనే ఏ రకమైన కణంగానైనా మారిపోగల మౌలిక కణం కదా! మరి అలాంటి ఆ మూలకణాల్లోనూ రకాలుంటాయి. పురుషుడి వీర్యకణం... మహిళలోని అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత తొలుత ఏర్పడేదే... పిండం. తొలుత ఇది ఒకే కణంగా ఉంటుంది. దీన్నే ‘ఎంబ్రియోనిక్‌ సెల్‌’ (ఫెర్టిలైజ్‌డ్‌ ఓవమ్‌) అంటారు.  ఆ తర్వాత భవిష్యత్తులో ఏర్పడాల్సిన వేర్వేరు కణజాలాలకు అనుగుణంగా ఈ కణం (ఫెర్టిలైజ్‌డ్‌ ఓవమ్‌) విభజన చెందుతూ రకరకాల మూలకణాలు ఏర్పడుతాయి. అటు తర్వాత అవి విభజితమవుతూ తాము భవిష్యత్తులో నిర్వహించాల్సిన వేర్వేరు అవయవాలూ, వ్యవస్థలకు అనుగుణంగా వేర్వేరు కణాలుగా రూపొందుతాయి. వీటి తొలిదశ కణాలనే మూలకణాలుగా పేర్కొనవచ్చు.

ఇది శాస్త్రవేత్తల ప్రతిభ... 
ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ప్రతివారికీ అవసరమైన మూలకణాలు దొరకకపోవడంతో శాస్త్రజ్ఞులు ప్రత్యామ్నాయ మార్గాలను శోధించి, కొంతమేరకు విజయం సాధించారు. పరిశోధనశాలల్లో మూలకణాలను రూపొందించారు. వీటినే ‘ఇండ్యూస్‌డ్‌ ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌సెల్స్‌’ (ఐపీఎస్‌) అని చెబుతారు. నిజానికి ఇవి మూలకణాల్లాగే పనిచేసినా... పుట్టినప్పుడుగానీ లేదా జీవితకాలంలో గానీ దేహంలో  ఎక్కడా ఉండవు. శాస్త్రజ్ఞులు చర్మం కణాల నుంచి కొన్నింటిని సేకరించి అచ్చం పిండం ఏర్పడినప్పుడు కనిపించే తొలి కణం (ఎంబ్రియోనిక్‌ స్టెమ్‌సెల్స్‌) లాంటివాటిని  సృష్టించగలిగారు.

మూలకణాలను కనుగొన్న తీరిది... 
దాదాపు మూడు దశాబ్దాల కిందట... అంటే 1998 ప్రాంతాల్లో... తమ పరిశోధనల్లో శాస్త్రజ్ఞులకు ఎలుకల పిండాలలో తొలిసారిగా మూలకణాలన గుర్తించారు. దాదాపు అదే టైములోనే తమ పరిశోధనల ద్వారా మానవ మూలకణాలను ల్యాబ్‌లో వేరు చేయడంలోనూ శాస్త్రజ్ఞులు విజయం సాధించారు. తొలిదశలో ఈ కణాలను ఉపయోగించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ వంటి ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి పిల్లలు కలిగేలా చేయడం వరకే వారి కృషి పరిమితమైంది. ఆ తర్వాత వాటిని ఉపయోగించడంపై అనేక నైతికపరమైన అభ్యంతరాలు, ప్రశ్నలు వెలువడ్డాయి.

ఇండ్యూస్‌డ్‌ ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌స్టెల్స్‌
వైద్యరంగంలో ప్రయోజనాలు అటు తర్వాత జరిగిన పరిశోధనల్లో మానవ చర్మం నుంచి కొన్ని కణాలను సేకరించి వాటిని అచ్చం మూలకణాల్లాగే ఉండే కణాలను ఇండ్యూస్‌డ్‌ ప్లూరిపొటెంట్‌ స్టెమ్‌సెల్స్‌ (ఐపీఎస్‌)గా రూపొందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రక్రియపైనా కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. అయినప్పటికీ వీటితో రకరకాల చికిత్స చేయడం ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని... వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వాటిని చికిత్సల్లో ఉపయోగిస్తున్నారు. ఎముక మజ్జ (బోన్‌ మ్యారో) నుంచి సేకరించిన కణాలతో కూడా మూలకణాలను రూపొందించి వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. అలా చికిత్స చేయడాన్ని మూలకణం చికిత్స లేదా స్టెమ్‌సెల్‌ థెరపీగా పేర్కొంటున్నారు.

మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్‌ థెరపీ) అంటే...? 
శరీరంలోని కొన్ని కణాలు పూర్తిగా దెబ్బతింటే అవి మళ్లీ పుట్టవు. దాంతో ఆ దెబ్బతిన్న అవయవంలో గానీ, ఆ వ్యవస్థలో గానీ శాశ్వత లోపం ఏర్పడుతుంది. అయితే  స్టెమ్‌సెల్స్‌ థెరపీ ద్వారా ఆ దెబ్బతిన్న / చనిపోయిన కణాల స్థానాన్ని ఈ మూలకణాలు భర్తీ చేయవచ్చు. అప్పుడవి అచ్చం ఆ అవయవానికి సంబంధించిన మునపటి కణాల్లాగే మారిపోతాయి. దాంతో ఆ అవయవం కూడా మునుపటిలాగే పని చేయడం ్రపారంభిస్తుంది. ఫలితంగా ఆ వ్యవస్థ (సిస్టమ్‌) కూడా ఎలాంటి లోపం లేకుండా తన పనితీరును కొనసాగిస్తుంది.

స్టెమ్‌సెల్‌ థెరపీ ఎప్పుడంటే...? 
సాధారణంగా ఇతర సంప్రదాయ వైద్య చికిత్సలైన మందులు ఇవ్వడం లేదా శస్త్రచికిత్స వంటివి ఫలితాలివ్వని సందర్భాల్లో మూలకణాలను సేకరించి ఒక అవయవానికి అందేలా చేస్తారు. అందుకే మూలకణాలతో చేసే చికిత్స ప్రక్రియను ‘రీజెనరేటివ్‌ మెడిసిన్‌’ అని కూడా అంటారు. మూలకణ చికిత్సకు ప్రత్యేకమైన చికిత్స ప్రక్రియలుంటాయి.  ఈ చికిత్సకులకు జాతీయ ఆరోగ్య అధికారుల నుంచి ప్రత్యేకమైన అనుమతి ఉంటుంది. ఆ చికిత్స విధానంలో నైపుణ్యం పొందిన చికిత్సకులే ఈ తరహా చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

మూలకణ చికిత్సలో ఆధునిక ప్రక్రియలు... 
మూలకణాలతో చేసే చికిత్స తొలి దశల్లో అంత వేగంగా సాగకపోయినప్పటికీ... ఇటీవల ఈ ప్రక్రియలో మంచి పురోగతి ఉంది. గత పదేళ్ల వ్యవధిలో ఈ అభివృద్ధి... పరిశోధనశాలల నుంచి ఆసుపత్రులకూ చేరింది. అయినా ఇప్పటికీ దీన్ని ఇంకా ఆవిర్భావ దశలో ఉన్న తొలిదశగానే చెప్పవచ్చు. అంటే ఇంకా ఈ రంగంలో అభివృద్ధి సాధించాల్సింది ఎంతో ఉందని అర్థం.

మూలకణ చికిత్సల్లో ఆశారేఖ ఏమిటంటే... తొలిదశల్లోనూ, పరిశోధనాత్మకదశల్లో చేసిన పరీశీలనల్లో అత్యంత సునిశితమైన ఈప్రక్రియ చాలా సురక్షితమైనదని తెలియడంతో పాటు ఇందులో పూర్తిగా నమ్మదగిన ఫలితాలే వచ్చాయి. గతంలో ఏదైనా అవయవం దెబ్బతింటే దాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం వచ్చేది. అయితే ఇప్పుడీ ఈ మూల కణాల ద్వారా అవయవంలో దెబ్బతిన్న మేరకు మూలకణాలను ప్రవేశపెట్టి, కొత్త కణాలను సృష్టించి అదే దెబ్బతిన్నదాన్ని పూర్తి ఆరోగ్యవంతమైన అవయవంగా మార్చగలిగే అవకాశాలున్నట్లుగా తేలింది. అందుకే దీన్ని ‘రీజనరేటివ్‌ మెడిసిన్‌’గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ రీజనరేటివ్‌ మెడిసిన్‌లోని తొలిగడప మీద ఉన్నామని చెప్పవచ్చు.

మూలకణాలతో ఏయే వ్యాధులకు చికిత్స అంటే? 
ప్రస్తుతానికి మనకు మూలకణ చికిత్సలో ఉన్న పరిజ్ఞానంతో క్యాన్సర్లలోని కొన్ని రకాలైన లుకేమియా (బ్లడ్‌క్యాన్సర్‌), లింఫోమా, అ΄్లాస్టిక్‌ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్‌ అనీమియా వంటి వ్యాధులకు చికిత్స చేయడం సాధ్యమవుతోంది. సాధారణ చికిత్సకు లొంగని క్రిటికల్‌ లింబ్‌ ఇస్కిమియా, డయాబెటిక్‌ ఫుట్‌ (మధుమేహం వల్ల కాలికి పుండుపడి కుళ్లిపోవడం), డయాబెటిక్‌ న్యూరోపతి (మధుమేహం వల్ల కాలి లేదా చేతి వేళ్ల చివరలలో మంటలు, తిమ్మిర్లు రావడం, స్పర్శ తగ్గడం), స్కీ›్లరోడెర్మా, సిస్టమిక్‌ ల్యూపస్‌ ఎరిథమెటోసిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, స్ట్రోక్‌ (పక్షవాతం), హార్ట్‌ఫెయిల్యూర్‌ (గుండెజబ్బులు), కాలేయ వ్యాధులు, డయాబెటిస్‌ (మధుమేహం), ఆర్థోపెడిక్‌ కాంప్లికేషన్స్‌ (ఎముక సంబంధమైన వ్యాధులు), ఫ్రాక్చర్లు, కార్నియల్‌ డ్యామేజ్‌ (కంటిలోని నల్లగుడ్డు దెబ్బతినడం), బట్టతల, బొల్లి (విటిలిగో) వంటి వ్యాధులకు మూలకణాలతో చికిత్స చేయవచ్చు.

సైంటిస్టులు రూపొందించిన మూలకణాలు!
మూలకణాలు శరీరమంతా అక్కడో ఇక్కడో ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో దొరకాలంటే మాత్రం అవి బొడ్డు తాడులోని రక్తంలోనే ఎక్కువగా ఉంటాయి. అయితే... ఇప్పటి తరాలతో పోలిస్తే... ఇంతకు ముందున్న  తరాల వారిలో బొడ్డు తాడు నుంచి మూలకణాలను వేరు చేసి  భద్రపరచడం అనే అంశంపై పెద్దగాఆసక్తి లేదు. ఎందుకంటే... అప్పట్లో మూలకణాలతో రకరకాల చికిత్సలు సాధ్యమవుతాయనే విషయమే పెద్దగా తెలియదు.

క్రిటికల్‌ లింబ్‌ ఇస్కిమియా 
ఈ వ్యాధి ఉన్నవారిలో కాళ్లలోని కింది భాగాలు గుండె నుంచి చాలాదూరంగా ఉన్నందువల్ల, అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల చివరి భాగాలకు తగిన మోతాదులో రక్తం అందదు. ఫలితంగా కాలిలోని ఒక ప్రాంతం మొత్తం పనికిరాకుండా పోతుంది. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స చేసి, ఆ అడ్డంకులు తొలగించలేని పరిస్థితి ఏర్పడితే... బాధితుడు తన కాలిని కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేని పరిస్థితుల్లో రోగికి మూలకణాలతో చికిత్స చేస్తారు. ఇలాంటి రోగులకు ప్రయోగాత్మకంగా చికిత్స  చేసిన చాలా సందర్భాల్లో రోగి కాలును తొలగించకుండానే, దాన్ని ఆరోగ్యవంతంగా  చేయడంలో పరిశోధకులు, డాక్టర్లు విజయం సాధించారు.

స్క్లీ రోడెర్మా, ల్యూపస్‌ అండ్‌ రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ 
మన సొంత వ్యాధి నిరోధక కణాలు సొంత వ్యవస్థలను పరాయివారిగా గుర్తించి దాడి చేయడం వల్ల  వచ్చే వ్యాధుల్ని ‘ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు’గా పేర్కొంటారు. ఈ వ్యాధుల్లో మన సొంత వ్యాధి నిరోధక శక్తిని కావాలనే తగ్గించాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరం తేలిగ్గా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఇది ్రపాణాలకే ముప్పుగా మారవచ్చు. అయితే... మూలకణ చికిత్సతో ఇలా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసే వ్యాధినిరోధక కణాల ఆగడాలను అరికట్టవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని సాధారణంగా పనిచేసేలాగానూ చేయవచ్చు.

బొల్లి (విటిలిగో)కి చికిత్స...  
చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు దెబ్బతినడం వల్ల చర్మం తన స్వాభావికమైన రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. దీని వల్ల చర్మంపై తెల్లటి మచ్చలు, పొడలు కనిపిస్తూ... కాస్మెటిక్‌గా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... ఆ ప్రదేశంలో మామూలు రంగునిచ్చే (పిగ్మెంట్‌ ఉన్న) కణాల్ని పెరిగేలా చేయడంతో కొద్దిరోజుల్లోనే చర్మమంతా ఒకే రంగు ఉన్నట్లుగా మారిపోతుంది. ఇలా విటిలిగోకు చికిత్స చేయవచ్చని స్టెమ్‌సెల్‌ బయాలజిస్టుల అభి్రపాయం.

ఇకపై బట్టతల ఉండకపోవచ్చు!
వెంట్రుక పుట్టే రోమమూలంలోకి ఈ స్టెమ్‌సెల్స్‌ ప్రవేశపెట్టడం వల్ల హెయిర్‌ ఫాలికిల్‌ పునరుజ్జీవమవుతుంది. ఫలితంగా హెయిర్‌ ఫాలికిల్‌ నుంచి వెంట్రుక మొలిచి, అది మామూలుగా పెరగడం మొదలవుతుంది. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో జరిగిన పరిశోధనల వల్ల ఈ విషయంలో మంచి ఫలితాలే కనిపించాయి. దీంతో మున్ముందు బట్టతల అనే సమస్య పూర్తిగా పరిష్కృతమవుతుందన్నది వైద్యవర్గాల ఆశాభావం.

బ్లడ్‌ క్యాన్సర్లు, రక్తసంబంధమైన వ్యాధులకు చికిత్స ఇలా... 
రక్తసంబంధమైన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన ఇతర వ్యాధులలో రక్తకణాలు పుట్టే మూల కేంద్రమైన ఎముక మజ్జను (బోన్‌ మ్యారో)ను బాధితుల నుంచి  పూర్తిగా తొలగించి... అక్కడ మరో దాత నుంచి స్వీకరించిన ఆరోగ్యవంతమైన మూలకణాలను ప్రవేశపెడతారు. దాంతో ఈ కొత్త ఆరోగ్యకరమైన మజ్జ కారణంగా... ఇకపై పుట్టే కణాలన్నీ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి. ఇలా చేసే ఈ చికిత్సతో బ్లడ్‌క్యాన్సర్లూ, రక్తసంబంధమైన వ్యాధులలోనూ చికిత్స సాధ్యమవుతోంది. ఈ రకమైన చికిత్స అనేది ఇప్పటికి... లుకేమియా, మల్టిపుల్‌ మైలోమా, లింఫోమా, రక్తసంబంధమైన ఇతర వ్యాధులైన అ΄్లాస్టిక్‌ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్‌ అనీమియాలో సాధ్యమవుతుంది.

వ్యాధిగ్రస్తుల దగ్గరి సంబంధీకుల నుంచి కొన్ని మూలకణాలను సేకరించి... వాటిని రక్తమార్పిడి తరహాలోనే వ్యాధిగ్రస్తులలో ప్రవేశపెట్టి చికిత్స చేస్తారు. అప్పటికే వ్యాధిగ్రస్తమై ఉన్న కణాలను నిర్మూలించడానికి కీమోథెరపీ లేదా రేడియేషన్‌ థెరపీ ఇస్తారు. ఒకసారి వ్యాధిగ్రస్త కణాలన్నీ శరీరం నుంచి తొలగిపోయాక... మూలకణాలతో మార్పిడి చేసిన మజ్జ నుంచి ఇకపై పూర్తిగా ఆరోగ్యకరమైన రక్తకణాలే పుడుతుంటాయి. అయితే సంప్రదాయ చికిత్స ద్వారా సదరు వ్యాధి లొంగని సందర్భాల్లో మాత్రమే ఈ చికిత్సను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఈ చికిత్సలో కీమోథెరపీ మోతాదు ఎక్కువైతే ఒక్కోసారి అది ఇన్ఫెక్షన్లకో లేదా కొన్నిసార్లు రక్తస్రావానికో దారితీసే ముప్పు (రిస్క్‌) ఉంటుంది. ప్రస్తుతం ఈ రిస్క్‌ తగ్గించేందుకు అవసరమైన పరిశోధనలు జరుగుతున్నాయి.

డయాబెటిక్‌ ఫుట్‌ అండ్‌ డయాబెటిక్‌ న్యూరోపతి 
మధుమేహం ఉన్నవారిలో ఈ దుష్ప్రభావం చాలా సాధారణం. చాలా సందర్భాల్లో మధుమేహం ఉన్న వ్యక్తుల కాళ్లకు పుండ్లు పడతాయి. అవి ఎప్పటికీ మానని దశకు చేరుకుని కుళ్లడం మొదలవుతుంది. గ్యాంగ్రీన్‌గా పేర్కొనే ఈ దశకు చేరుకున్న కాలిని తొలగించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని దశకు బాధితులు చేరుకుంటారు. అయితే ఇటీవలి పరిశోధనల వల్ల ఈ తరహా సమస్యలను ఎదుర్కొనే వారిలో స్టెమ్‌సెల్స్‌ వల్ల డయాబెటిక్‌ ఫుట్‌నూ, డయాబెటిక్‌ న్యూరోపతిని తగ్గించే అవకాశాలు ఎక్కువేనని తెలిసింది.

ఎముక సంబంధ వ్యాధులు (ఆర్థోపెడిక్‌ కాంప్లికేషన్స్‌) 
ఎముక సంబంధ వ్యాధుల్లోనూ అనేక రకాలు ఉంటాయి. ఉదాహరణకు పాదం,  చీలమండ, తుంటిభాగం, మోకాలు నుంచి మొదలుకొని కీలకమైన వెన్నెముక వరకూ అనేక రకాల ఎముకలు ఉంటాయి. ఇవి రకరకాల సమస్యలకు గురవుతుంటాయి. విరిగిన ఎముకలు సరిగా అతుక్కోకపోవడం, వీటిపై ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్‌)  దెబ్బతినడం, ఎముకకు రక్తప్రసరణ లేక ఎముకలోని కొంతభాగం మృతిచెందడం (ఎవాస్క్యులార్‌ నెక్రోసిస్‌) వంటివి ఇందులో కొన్ని. ఇలాంటి ఎన్నో వ్యాధులకు గతంలో అంతగా ఫలితాలివ్వని వాటిల్లో కూడా... ఇప్పుడు మూలకణ చికిత్సలతో మంచి ఫలితాలే వస్తున్నాయి. ఎముకలోని కొంత భాగం పూర్తిగా మృతిచెందిన 3–4 ఏళ్ల తర్వాత కూడా ఆ భాగం మళ్లీ పునరుజ్జీవంతో మామూలుగానే పనిచేసిన దాఖలాలు ఉన్నాయి.

గుండె, కాలేయ సంబంధ వ్యాధుల్లో... 
ఇప్పటికే గుండె, కాలేయ సంబంధిత వ్యాధుల్లో స్టెమ్‌సెల్‌ థెరపీ ద్వారా అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మున్ముందు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చన్నది వైద్య వర్గాల మాట. గుండె కండరాలు దెబ్బతిన్న ప్రాంతంలో... చనిపోయిన ఆ కణాలను పునరుజ్జీవించేలా చేసి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ను రివర్స్‌ చేయవచ్చన్నది పరిశోధనలతో తెలిసివస్తున్న మాట.

అలాగే కాలేయం విషయానికి వస్తే... మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతిని, అది పూర్తిగా చెడిపోయిన వారికి, స్టెమ్‌సెల్స్‌ను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టి... దెబ్బతిన్న భాగాన్ని మళ్లీ పునరుజ్జీవింపజేయవచ్చని తేలింది. అయితే ఈ పరిశోధనలు ఇంకా ్రపాథమిక పరిశోధన దశల్లో ఉన్నప్పటికీ... కొన్నాళ్లలోనే ఆ చికిత్స ప్రక్రియలుగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కార్నియా, రెటీనా సమస్యలకు... 
గతంలో కంటి నల్లగుడ్డు కార్నియాలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గానీ... లేదా దృశ్యాన్ని తన తెరపై పట్టివేసే... రెటీనా కణాలు గాని దెబ్బతిన్నప్పుడు అవి మళ్లీ పునరుజ్జీవించేందుకు ఆస్కారమే ఉండేది కాదు. అయితే స్టెమ్‌సెల్స్‌ వల్ల ఇలా క్రమంగా క్షీణిస్తూ మృతిచెందిన కార్నియా, రెటీనా కణాలను పునరుజ్జీవింపజేసేందుకు మూలకణాలు తోడ్పడతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. వాటి ఆధారంగా కొద్దిరోజుల్లోనే ఈ మూలకణాలతో కార్నియా, రెటీనా భాగాలను పునరుజ్జీవింపజేసి... అనేక మంది అంధులకు మళ్లీ కంటివెలుగు తెప్పించే  రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నది సైంటిస్టులు, డాక్టర్లకు కనిపిస్తున్న ఆశారేఖ.

చివరగా... మూలకణ పరిశోధకులు (స్టెమ్‌సెల్‌ స్పెషలిస్ట్స్‌), క్లినీషియన్స్‌ (డాక్టర్లు), కొన్ని సందర్భాల్లో సర్జన్లు (శస్త్రచికిత్సకులు) కలిసి సంయుక్తంగా ఒక బృందంగా ఏర్పడి ఈ చికిత్సలను నిర్వహిస్తుంటారు. మున్ముందు ఈ రంగంలో కనుగొనబోయే చికిత్సలతో వైద్యరంగంలోనే విప్లవాత్మకమైన మార్పులు రావచ్చన్నది పలువురు పరిశోధకులు, వైద్యవర్గాల భావన.

- డాక్టర్‌ సాదత్‌ అల్‌ అలీ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ రీ జెనరేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ ఆర్థోపెడిక్‌ సర్జరీ

నిర్వహణ: యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement