శివసాగర్: అస్సాంలో భారీ వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 100కి చేరింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీఆర్ఐఎంఎస్) అస్సాం బులెటిన్ ప్రకారం.. ఈ విపత్తులో 60 మంది పురుషులు, 23 మంది మహిళలు, 18 మంది పిల్లలు (12 మంది బాలురు, 6 గురు బాలికలు) ప్రాణాలు కోల్పోయారు.
శివసాగర్ జిల్లాలో ఒకే పేరుతో ఒక మరణం పొరపాటున రెండుసార్లు నమోదైందని, దీంతో ఆ జిల్లాలో మృతుల సంఖ్యను 50 నుండి 49కి సవరించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాల్లో కచార్ జిల్లాలో 22 మంది, శివసాగర్ జిల్లాలో 49 మంది మరణించారు. కరీమ్‌గంజ్ (9), గోలాఘాట్ (8) జిల్లాలతో పాటు ధెమాజి, నాగావ్, ఉదల్‌గురి, సోనిత్‌పూర్, కార్బి ఆంగ్లాంగ్ జిల్లాల్లోనూ ప్రాణనష్టం సంభవించింది. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
జోర్హాట్ జిల్లాలోని 304 గ్రామాల్లో సుమారు 1,66,000 మంది వరదల బారిన పడ్డారు. వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పశు సంపద కూడా కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సహాయక చర్యలు, వైద్య సేవలను అందిస్తున్నాయి. ఈ విపత్తులో అస్సాం ప్రజలకు అండగా నిలిచేందుకు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: తమ్ముని అంత్యక్రియలకు వెళ్తూ అతీక్ కుమారుని వీరంగం!


