ఒకప్పుడు ఆర్థికవేత్తలు సరదాగా అనేవారు.. ‘‘ప్రపంచంలో నాలుగు రకాల ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని. అవేంటంటే: డెవలప్డ్ అంటే.. అభివృద్ధి చెందినది. అన్‌డెవలప్డ్ అంటే.. అభివృద్ధి చెందనిది. అర్జెంటీనా.. జపాన్!’’ అని చెప్పేవారు. ఇందులో జపాన్ సంగతే చాలా విచిత్రం.. ! గత మూడు దశాబ్దాలుగా ఎకనామిక్ గ్రావిటీ ఏమాత్రం పనిచేయకుండా, లెక్కలేనంత డబ్బును ప్రింట్ చేస్తూ, విపరీతంగా అప్పులు చేస్తూ వచ్చినా.. ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరగలేదు. బాండ్ మార్కెట్ల నుంచి ఎటువంటి వ్యతిరేకతా రాలేదు.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది..! జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి వస్తుండటంతో, ఇన్నాళ్లుగా దాగి ఉన్న సమస్యలన్నీ ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన జపాన్‌లో, రుణాలు విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాదు, జపాన్ కరెన్సీ 'యెన్' (Yen) విలువ ఏకంగా 40 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది..! అసలు జపాన్ ఎకానమీకి ఏమైంది? అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి అసలు కారణాలు ఏంటి? ఇవాళ్టి పాడ్‌కాస్ట్‌లో డిటైల్‌గా చర్చిద్దాం..!
ఫ్లాష్‌బ్యాక్ ఏంటి?
అసలు జపాన్ ఈ పరిస్థితికి ఎలా చేరుకుందో తెలియాలంటే.. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్లాల్సిందే..! 1990లలో వరుస ఆర్థిక షాక్‌ల వల్ల జపాన్ కుదేలైంది..! ప్రాపర్టీ ధరలు, స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. దాంతో వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం సున్నాకి పడిపోయి, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. అంటే.. Stagnation స్థితికి జపాన్ చేరుకుంది. దీని నుంచి బయటపడటానికి జపాన్ సెంట్రల్ బ్యాంక్.. Bank of Japan రంగంలోకి దిగింది. వేల కోట్ల యెన్ విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసింది.
సింపుల్‌గా చెప్పాలంటే.. నోట్లు ప్రింట్ చేసి, ప్రభుత్వానికి ఇచ్చి ఖర్చు చేయమని ఆదేశించింది. సాధారణంగా ఇలా చేస్తే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగాలి; జపాన్ కోరుకున్నది కూడా అదే..! కానీ, అలా జరగలేదు. ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు రెండూ మొండిగా సున్నా దగ్గరే ఉండిపోయాయి. మరోవైపు ప్రభుత్వ రుణం మాత్రం దేశ జీడీపీలో 200 శాతానికి పైగా పెరిగిపోయింది..! కానీ, 2022 ప్రారంభంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ద్రవ్యోల్బణం.. జపాన్‌ను కూడా అట్టుడికించింది.
దాదాపు దశాబ్ద కాలం తర్వాత జపాన్ ఇన్‌ఫ్లేషన్ రేటు 2 శాతాన్ని దాటింది. దీన్ని సానుకూలంగా మార్చుకోవాలని జపాన్ భావించింది. Wage-Price Spiral ద్వారా పరిస్థితి చక్కబడుతుందని ఆశించింది. అంటే, ధరలు పెరిగితే కార్మికులు ఎక్కువ జీతాలు డిమాండ్ చేస్తారు. జనాల దగ్గర డబ్బు బాగా చేరితే.. దాన్ని ఖర్చు చేస్తారు. తద్వారా ఇన్‌ఫ్లేషన్ 2 శాతం టార్గెట్‌కి చేరుకుంటుందని అనుకున్నారు. కానీ, ఇక్కడే అసలు దెబ్బ తగిలింది..! ఇన్‌ఫ్లేషన్ ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగిపోయింది. గత 4 సంవత్సరాలుగా టార్గెట్ 2 శాతానికి మించే ఉంది. దీనికి తోడు కార్మికుల వేతనాలు 5 శాతం దాకా పెరగడం, ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలు జపాన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.
'యెన్' విలువ పతనం ఇలా..
ఇలా ఇన్‌ఫ్లేషన్ పెరగడం వల్లే జపాన్ కరెన్సీ 'యెన్' విలువ పడిపోతూ వచ్చింది. 2022 నుంచి పడుతూ వస్తున్న యెన్ విలువ, గత వారం డాలర్‌తో పోలిస్తే ఏకంగా 163కి పడిపోయి 40 ఏళ్ల కనిష్టాన్ని తాకింది..! దీనికి ప్రధాన కారణం.. ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇన్‌ఫ్లేషన్‌ను అణచివేయడానికి వడ్డీ రేట్లను భారీగా పెంచాయి. కానీ, జపాన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం 2024 మార్చి దాకా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది..! అదే సమయంలో ఐరోపాలో వడ్డీ రేట్లు 4.5 శాతం, అమెరికాలో 5.5 శాతంగా ఉన్నాయి..!
ఈ వడ్డీ రేట్ల వ్యత్యాసం వల్ల జపాన్ ప్రజలు యెన్‌ను దాచుకోవడం కంటే, డాలర్లు లేదా యూరోలలో సేవ్ చేసుకోవడమే బెటర్ అనుకున్నారు. దీంతో యెన్ మీద మరింత భారం పడింది. జపాన్ ప్రభుత్వం తన కరెన్సీని కాపాడుకోవడానికి ఏకంగా 73 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి మార్కెట్లో జోక్యం చేసుకున్నా.. ఫలితం లేకపోయింది. ఇన్వెస్టర్లకు జపాన్ సెంట్రల్ బ్యాంకు మీద నమ్మకం సడలిపోయింది.
ఇప్పుడు అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న మెదులుతోంది..! 'మరి అందరిలాగా జపాన్ కూడా వడ్డీ రేట్లు పెంచొచ్చు కదా?' అని. సమస్య ఇక్కడే ఉంది..! జపాన్ మీద ఉన్న విపరీతమైన అప్పుల భారమే దీనికి ప్రధాన అడ్డుగోడ. వడ్డీ రేట్లు పెంచితే ప్రభుత్వ బాండ్ Yields కూడా పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం తన అప్పులపై భారీగా వడ్డీ చెల్లించడం అసాధ్యం అయిపోతుంది. మరోవైపు, బాండ్ల మీద వడ్డీని కృత్రిమంగా అణచిపెడదామంటే, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇప్పుడు జపాన్ సెంట్రల్
బ్యాంక్ ముందు రెండు ప్రమాదకరమైన దారులున్నాయి
ఒకటి: కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కోవడం.
రెండోది: బాండ్ సంక్షోభాన్ని (Bond Crisis) ఎదుర్కోవడం.
ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, రెండూ పతనం అంచున ఉన్నాయి. అయితే, జపాన్ ప్రస్తుతానికి పూర్తిగా మునిగిపోదనేందుకు ఒక కారణం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జపాన్ ప్రభుత్వం విదేశాల్లో ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ఆస్తులను కూడబెట్టింది. అత్యవసరమైతే వాటిని అమ్మి అప్పులు తీర్చగలదు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతుంది.
-హెచ్. కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్


